కళ్యాణ చాళుక్య త్రిభువన మల్ల చక్రవర్తి దాన శాసనంను చూపుతున్న చరిత్ర పరిశోధకుడు కేపీ రాజ్‌కుమార్, ఎడమచేతి పిడికిలి బిగించిన వీరగల్లు.
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి వందల సంవత్సరాల వైభవోపేతమైన, అరుదైన చరిత్ర ఉందనడానికి బలమైన సాక్ష్యాలు లభించాయి. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కె.పి.రాజ్ కుమార్ నేతృత్వంలో సాగిన క్షేత్రస్థాయి పరిశోధనల్లో క్రీస్తు శకం 8వ శతాబ్దం, 11వ శతాబ్దాలకు చెందిన అత్యంత అరుదైన వీరగల్లు శిల్పాలు, శాసనాలు వెలుగుచూశాయి. స్థానిక రామాలయం ప్రాంగణంతో పాటు ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ చారిత్రక సంపదను ఆయన గుర్తించారు.
ఈ పరిశోధనల్లో లభించిన శిల్పాలలో క్రీస్తు శకం 8వ శతాబ్దపు రాష్ట్రకూటుల (Rashtrakuta Dynasty) శైలికి చెందిన వీరగల్లు అత్యంత అద్భుతమైనదిగా నిలిచిందన్నారు. ప్రజల రక్షణ కోసం, మోక్ష సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన ఒక వీరుని స్మృతిలో అతని తదనంతరం ఈ శిల్పాన్ని చెక్కించినట్లు తెలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీరగల్లులే కాకుండా, ఇదే ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం 1,112 సంవత్సరానికి చెందిన మరో అద్భుతమైన చారిత్రక ఆధారం లభించిందన్నారు. కళ్యాణ చాళుక్య వంశానికి చెందిన ప్రముఖ రాజు త్రిభువనమల్ల దేవరాజు వేయించిన రాజధాని శాసనం అని పేర్కొన్నారు.

ఒకే ప్రాంతంలో 8వ శతాబ్దపు రాష్ట్రకూటుల కాలం నాటి శిల్పాలు, 12వ శతాబ్దపు ప్రారంభ కాలం నాటి చాళుక్యుల శాసనాలు లభించడం వల్ల తూప్రాన్ ప్రాంతం శతాబ్దాల పాటు ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా విరాసిల్లిందని స్పష్టమవుతోందని తెలిపారు. ప్రభుత్వం పురావస్తు శాఖ తక్షణమే స్పందించి, ఈ అరుదైన విగ్రహాలను, శాసనాలను గుర్తించి భద్రపరచాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: దానం నాగేందర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


