కరాటే తేజం | India athlete Satya Teja Brahmadandi achieved today under Junior Female Kumite | Sakshi
Sakshi News home page

కరాటే తేజం

Sep 25 2026 4:20 AM | Updated on Sep 25 2026 4:20 AM

India athlete Satya Teja Brahmadandi achieved today under Junior Female Kumite

‘ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కరాటే... అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే స్థాయికి చేర్చింది’ అంటోంది తెలంగాణ వాసి బ్రహ్మదండి సత్యతేజ. ఇటీవల జోర్డాన్‌ దేశ రాజధాని అమ్మాన్‌లో 24వ ఆసియా కేడెట్, జూనియర్‌ అండ్‌ అండర్‌ 21 కరాటే ఛాంపియన్ షిప్‌–2026 పోటీలు జరిగాయి. 

ఈ పోటీలలో జూనియర్‌ ఫిమేల్‌ కుమిటే 66 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి తన పోరాట పటిమను నిరూపించింది హైదరాబాద్‌ నారాయణగూడలో ఉంటున్న సత్యతేజ. ఎల్‌ఎల్‌బి ఫస్టియర్‌ చదువుతున్న ఈ కరాటే మెరుపును ఈ సందర్భంగా పలకరిస్తే ‘చదువు – క్రీడలు ఈ రెండూ నేటితరం అమ్మాయిలకు తప్పనిసరి అవసరం’ అంటూ... స్ఫూర్తిదాయకమైన తన ప్రయాణం గురించి వివరించిందిలా..

‘‘కరాటే అంటే కేవలం శారీరక బలం మాత్రమే కాదు. ఏకాగ్రత, వేగం, సమయస్ఫూర్తి, మానసిక స్థైర్యం కూడా. శిక్షణలో ఇదే తెలుసుకుంటూ వస్తున్నాను. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య కూడా ఉండాలని అమ్మానాన్నలు నన్ను కరాటే క్లాస్‌లో చేర్పించారు. అమ్మ స్వర్ణలత, నాన్న రమేష్‌ ఇద్దరూ లాయర్లే. నేను వారి స్ఫూర్తితోనే, న్యాయవాదిగా ఎదగాలన్న లక్ష్యంతో ‘లా’ చదువుతున్నాను.  

ప్రయత్నమే ఫలితం..
ధైర్యం, స్థైర్యం, సహనం, నేర్పు, వేగం.. ఇలా ప్రతి అంశం క్రీడలలో నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే చదువుతో పాటు ఏదైనా క్రీడలో రాణించాలని ఎప్పుడూ ఉండేది. సాధన చేస్తున్న క్రీడలోనే మరింతగా ఎదగాలనే తపన తో శిక్షణ ద్వారా కరాటేను మెరుగుపరుచుకుంటూ వస్తున్నాను. అందుకు జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో జూనియర్, సీనియర్‌ కేటగిరీలలో గోల్డ్, సిల్వర్‌ మెడల్స్‌ లభించాయి.

 ఈ స్ఫూర్తితోనే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు, మా కోచ్‌ కీర్తన్‌ కొండ్రు తమ ప్రోత్సాహాన్ని అందించారు. ‘ఓడిపోతామేమో అనుకుని ఆగిపోతే ఏ ఫలితమూ మన దరిచేరదు. నూటికి నూరు పాళ్లూ ప్రయత్నిస్తే అదే తగిన ఫలితాలను తెచ్చిపెడుతుంది’ అని చెప్పే అమ్మనాన్న మాటలే నాకు పాఠాలు. 

క్రమశిక్షణతో శిక్షణ
క్రీడలలో పాల్గొనేవారికి సమయం విలువ బాగా అర్థం అవుతుంది. ప్రత్యర్ధితో తలపడటంలో చూపే నేర్పు ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలియజేస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుకు ఆటంకం రాకుండా కాలేజీకి వెళుతూనే సాయంకాలాలు శిక్షణకు కేటాయించుకున్నాను. పోషకాహారంపైన దృష్టిపెట్టడం, సమయపాలనను పాటిస్తూ సాధన చేయడం వల్ల కృషికి తగిన ఫలితం లభిస్తోంది. వివిధ దేశాల క్రీడాకారులతో ఏర్పడిన పరిచయాలు, వారు క్రీడల్లో చూపుతున్న నైపుణ్యాల గమనింపు.. ఇవన్నీ మరో మెట్టుకు ఎదగడానికి సోపానాలే అవుతున్నాయి’’ అంటూ వివరించారు ఈ యువ కరాటే క్రీడాకారిణి. 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement