22ఏలో ఉన్నా.. రిజిస్ట్రేషన్‌ | Revenue Department issues orders regarding registration of prohibited lands | Sakshi
Sakshi News home page

22ఏలో ఉన్నా.. రిజిస్ట్రేషన్‌

Sep 25 2026 1:55 AM | Updated on Sep 25 2026 1:55 AM

Revenue Department issues orders regarding registration of prohibited lands

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులున్న ఆస్తులకు అవకాశం

ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం  

తక్షణ రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు  

సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీలు... జీవోలు 118, 76 తర్వాత మరో కీలక నిర్ణయం 

ఆస్తులున్నా ఏళ్లుగా క్రయవిక్రయాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఊరట  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత 22ఏ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా చేతిలో ఉన్న ఆస్తులను విక్రయించుకోలేక, కొనుగోలు చేసిన ఆస్తులను తమ పేర్లపై బదిలీ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఊరట కల్పించేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 22ఏ జాబితాలో భూమి ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన లేఅవుట్, భవన నిర్మాణం, అపార్ట్‌మెంట్‌ అనుమతులు పొందిన ఇళ్లు, ఓపెన్‌ ప్లాట్లు, ఫ్లాట్లను నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు 22ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించే చర్యల్లో భాగంగానే సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 

కొన్నేళ్లుగా కష్టంగా రిజిస్ట్రేషన్లు 
భూములు రికార్డుల్లో 22ఏ జాబితాలో నమోదు కావడం వల్ల వాటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం అనేక ప్రాంతాల్లో ప్రజలకు సమస్యగా మారింది. ఒకవైపు తాము కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి పత్రాలు, లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు ఉన్నప్పటికీ.. రిజిస్ట్రేషన్‌ సమయంలో 22ఏ అంశం అడ్డంకిగా మారడంతో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు రుణాలు, ఆస్తుల విక్రయాలు, వారసత్వ బదలాయింపులు తదితర అంశాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో 22ఏ జాబితాలో ఉన్న ప్రతి భూమినీ ఒకే రకంగా చూడకుండా.. భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, సంబంధిత ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి అర్హత ఉన్న కేసులకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఈ ప్రక్రియలో కీలక అడుగుగా భావిస్తున్నారు. 

అనుమతులుంటే రిజిస్ట్రేషన్‌కు అవకాశం 
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, పురపాలక సంస్థలు లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటయ్యే అనుమతులు పొందిన ఆస్తులకు ఈ రిజిస్ట్రేషన్‌ నిర్ణయం వర్తించనుంది. లేఅవుట్, భవన నిర్మాణ అనుమతి లేదా అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి సంబంధించిన చట్టబద్ధమైన అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లను నిర్దేశిత నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అనుమతి పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తుదారులు ఏదో ఒక లింక్‌ డాక్యుమెంట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. 22ఏ జాబితా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మంత్రి పొంగులేటి ప్రస్తావించారు. రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని సుమారు 64 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యకు జీవో 118కు అనుగుణంగా మెమో జారీ చేసినట్లు తెలిపారు. అలాగే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యకు జీవో 76 ద్వారా పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో 22ఏలో ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థల అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం జరుగుతోంది.   

సమస్యలను పరిష్కరించేందుకు కమిటీ 
రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు తలెత్తితే వాటిని పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), జిల్లా రిజి్రస్టార్, హెచ్‌ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎదురయ్యే సమస్యలను ఈ కమిటీ పరిశీలించి పరిష్కరించనుంది. భూమి, ఇళ్లకు సంబంధించిన సమస్యలతో ప్రజలు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు. 22ఏలో ఉన్న అన్ని భూములను ఒకే గాటన కట్టకుండా.. అర్హమైన సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement