సాక్షి,హైదరాబాద్: మహానగరంలో వినాయక చవితి ఉత్సవాలు చివరి దశకు చేరాయి. అత్యంత వైభవంగా సాగిన తొమ్మిది రోజుల పూజల అనంతరం భక్తులు గణనాథులకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు సమాయత్తమయ్యారు. భాగ్యనగరంలో సామూహిక వినాయక నిమజ్జన శోభాయాత్రకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 141 నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేయగా, మూడు కార్పొరేషన్ల పరిధిలో భారీగా 275 క్రేన్లను సిద్ధం చేశారు. ప్రధాన నిమజ్జన కేంద్రమైన హుస్సేన్ సాగర్ చుట్టూ అధికారులు భారీ భద్రతా, సౌకర్యాలు చేపట్టారు. కేవలం సాగర్ చుట్టూనే 47 క్రేన్లను ఏర్పాటు చేయగా, అత్యవసర పరిస్థితుల కోసం మరో 17 క్రేన్లను రిజర్వ్‌లో ఉంచారు. హుస్సేన్‌సాగర్ వద్ద నిమజ్జన ప్రక్రియను ఒకే రోజులో వేగంగా పూర్తి చేసేలా ఎన్టీఆర్ మార్గ్ వద్ద ప్లాట్‌ఫారమ్‌లను అప్‌గ్రేడ్ చేశారు.
నిమజ్జన ఏర్పాట్ల కోసం ఏకంగా 3,264 మంది పారిశుద్ధ్య సిబ్బందిని రంగంలోకి దించారు. బాలాపూర్ నుంచి చార్మినార్, గోషామహల్, అబిడ్స్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు సాగే ప్రధాన ఊరేగింపు మార్గంలో సుమారు 100 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా నగరవ్యాప్తంగా నిమజ్జన కేంద్రాల వద్ద 478 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. భక్తుల కోసం తాగునీరు, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లతో పాటు అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రధాన చెరువులు, బేబీ పాండ్ల వద్ద కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విగ్రహాలతో వచ్చే చెత్తను చెరువుల్లో వేయకుండా ముందస్తుగానే కలెక్ట్ చేసి వేరుచేసే (స్రిగేషన్) ప్రక్రియను కూడా పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్నారు.
ఖైరతాబాద్‌లోని భారీ గణనాథుడి నిమజ్జన శోభాయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మహా గణపతి శోభాయాత్ర కోసం సిద్ధం చేసిన భారీ టస్కర్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత విగ్రహాన్ని ట్రాలీ ఎక్కిస్తారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు చివరి దశ వెల్డింగ్ పనులు ముగుస్తాయి. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం సరిగ్గా 6 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి శోభా యాత్ర ప్రారంభం కానుంది.మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30 నిమిషాల మధ్య మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


