డాటరాఫ్ ఇండియా
‘ఆడపిల్లవి...డిష్యుం డిష్యుం ఆటలు నీకెందుకమ్మా’ అనే తల్లిదండ్రులను చూస్తుంటాం.
నవ్వుతూనే అన్నప్పటికీ ఆడబిడ్డల కలలకు పరిమితులు విధించే అనధికార ఆంక్ష అది.
కానీ రోషిబినా దేవి తల్లిదండ్రులు అలా కాదు.
మార్షల్ ఆర్ట్ సినిమాలు తెగచూస్తూ....డిష్యుం డిష్యుం ఫైట్లు చేసే కూతురిని చూసి...
‘హీరో కంటే నువ్వే బాగా చేస్తున్నావు తల్లీ!’ అనేవారు. ఇది చాలదా... భవిష్యత్ కలకు బలమైన పునాది పడడానికి!
తాజాగా...
ఆసియా క్రీడల్లో ‘వుషు’ 60 కిలోల విభాగంలో మణిపూర్‌కు చెందిన రోషిబినా దేవి రజతం గెలుచుకుంది. 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం, 2023 ఆసియా క్రీడల్లో రజతం గెల్చుకున్న రోషిబినా దేవి ముచ్చటగా మూడోసారి పతకం గెల్చుకొని ఆసియా గేమ్స్‌లో పతకాల హాట్రిక్ సాధించింది. ‘నా తల్లిదండ్రులు సర్వస్వం త్యాగం చేశారు’ అని తడి కళ్లతో చెబుతున్నప్పుడు, ఆ కళ్లలోనే గర్వరేఖ మెరుస్తుంది. రోషిబినా దేవి అంతరంగం ఆమె మాటల్లోనే...
మాది మణిపూర్‌లోని ఓ పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ రైతులు. నాకు చిన్నప్పటి నుంచీ మార్షల్ ఆర్ట్స్ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా జాకీచాన్ సినిమాలు! మార్షల్ ఆర్ట్స్‌పై ఇష్టంతోనే నేను మార్షల్ ఆర్ట్ ‘వుషు’పై ఆసక్తి పెంచుకున్నాను. తొమ్మిదేళ్ల వయసులో ఈ ఆటలోకి వచ్చాను. ‘వుషు’ గురించి నా తల్లిదండ్రులకు బొత్తిగా తెలియదు.‘మార్షల్ ఆర్ట్స్ సినిమాలు అమ్మాయిలకెందుకు?’ అని గానీ ‘వుషు ఆట నీకెందుకు?’ అనిగానీ వారు ఎప్పుడూ అనలేదు. నేను ఏది చేసినా వారికి అపురూపమే. తల్లిదండ్రుల ప్రోత్సాహమే నాకు కొండంత అండగా నిలిచింది. నా సోదరి నన్ను స్పోర్ట్ ఆథారిటీ ఇండియా(ఎస్‌ఎఐ)కి పరిచయం చేసింది. 2014లో నా కోచ్ మైబాబ్ ప్రేమ్‌కుమార్‌తో నా ప్రయాణం ప్రారంభమైంది.
సాధన ఒక్కటే సరిపోదు...
కోచ్ పర్యవేక్షణలో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటలు ‘వుష్’ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆటలో రాణించాలంటే సాధన ఒక్కటే సరిపోదు. పట్టుదల, అంకితభావం కూడా తోడు ఉండాలి. శిక్షణ లేనప్పుడు... సంగీతం వింటాను. ఫుట్‌బాల్ ఆడుతాను. వీడియో గేమ్స్ చూస్తాను. ఇలాంటి ఇష్టమైన పనుల ద్వారా నాలో సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటాను.
ఈ క్రెడిట్ వారికే...
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిMీ నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ నా కోసం సర్వస్వం త్యాగం చేశారు. నాకు ఏదో ఒక రకంగా సహాయపడేవారు. నాకు ధైర్యం చెప్పేవారు. వారి సహకారమే లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్నే కాదు.,,
లక్ష్యాన్ని సాధించాలనుకునేవారికి నేను చెప్పేదేమిటంటే...మనం ఏ పని చేసినా అంకితభావంతో, కఠోర శ్రమతో చేయాలి. మనల్ని మనం నమ్ముకోవాలి. నిరాశను దరి చేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో... సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలి.
ఒక కూతురు మణిపూర్ పొలాల నుంచి లేచి ఆసియా గేమ్స్‌లో పతకాల హాట్రిక్ కొట్టింది. మరో కూతురు పదేళ్లకే స్కూబా సూట్ వేసుకుని నాన్న చేయి పట్టుకుని సముద్ర గర్భంలోకి దూకి ‘భయం అంటే ఏంటో’ తెలియని తరానికి ప్రతినిధి అని నిరూపించింది. ఇంకో కూతురు బుల్లెట్లకు ఎదురొడ్డి దేశాన్ని కాపాడి తన ఇద్దరు కూతుళ్లతో పాటు కోట్లాది ఆడబిడ్డలకు ‘పులిబిడ్డ’ అయింది. ఈ ముగ్గురి వెనుకా ఉన్నది ఒక్కరే.... ‘నా కూతురు ఏదైనా చేయగలదు’ అని నమ్మిన తల్లిదండ్రులు. నమ్మి చూడండి... ప్రోత్సహించి చూడండి... ప్రతి కూతురూ ఒక ఆశ... ఆశ్చర్యం... అద్భుతం. అంతేనా? ఈ దేశానికే గర్వకారణం.
– యాకుబ్ పాషా


