source: X
ఏషియన్ గేమ్స్ పురుషుల హాకీలో భారత జట్టు అజేయ జైత్రయాత్ర కొనసాగుతోంది. దక్షిణ కొరియాతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ 8-2తో గెలిచి పూల్-ఏలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ప్రస్తుత క్రీడల్లో భారత్‌కు వరుసగా ఇది మూడో గెలుపు.
భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేశారు. షిలానంద్ లక్రా, సుఖ్‌జీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రాజిందర్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. ఆసియా గేమ్స్ చరిత్రలో దక్షిణ కొరియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య జపాన్‌తో (శనివారం) తలపడనుంది.
ఇదిలా ఉంటే, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 15 పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇవాళ వుషు మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి రజత పతకం సాధించింది. ఆతర్వాత డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం గెలిచారు. స్కీట్ షూటింగ్ మిక్స్‌డ్ పెయిర్ ఈవెంట్లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధలీవాల్ కాంస్యం సొంతం చేసుకున్నారు.
ఇదీ చదవండి: పదిహేనుకు చేరిన పతకాల సంఖ్య


