Photo Credit: BCCI/Sonysports
‘‘ఇప్పటి వరకు నా రెండేళ్ల కోచింగ్ కెరీర్‌లో ఆ రాత్రి నాకు నిద్రపట్టనేలేదు. సంజూకు నేను ఇదే విషయం చెప్పాను. కోచ్‌గా నేను తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం ఇదేనని అన్నాను.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచిన ఆటగాడిని.. ఆ మెగా ఈవెంట్ తర్వాత మూడు, నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడించి పక్కనపెట్టడం సాధారణ విషయం కాదు. అందుకు వైభవ్ సూర్యవంశీ ఫామ్ ప్రధాన కారణమని చెప్పవచ్చు.
సంజూ అర్థం చేసుకున్నాడు
సిరీస్ గెలవాలన్న లక్ష్యం ఒక్కటే కళ్ల ముందు మెదిలింది. అందుకోసం మార్పులకు కూడా సిద్ధపడ్డాము. కోచ్‌గా ప్రతి ఒక్కరికి ప్రతీ సిరీస్ గెలవడమే ప్రధాన లక్ష్యం. నేను కూడా అంతే. ఆరోజు సంజూతో నేను నిజాయితీగా.. మనసు విప్పి మాట్లాడాను. వైభవ్ లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించాను.
సంజూ అర్థం చేసుకున్నాడు. అతడు జట్టు గురించి మాత్రమే ఆలోచించాడు. అది చాలా మంచి విషయం. ఏదేమైనా వైభవ్ లాంటి యువ ఆటగాళ్లు తుదిజట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పదు.
వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పాను
మంచి ఫామ్‌లో ఉన్నా సరే.. సుదీర్ఘకాలంగా జట్టుకు సేవలు అందిస్తున్న ఆటగాళ్ల కోసం కొన్నిసార్లు త్యాగం చేయాల్సి ఉంటుందని.. అవకాశం వచ్చే వరకు ఎదురుచూడాలని వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పాను’’ అని టీమిండియా హెడ్‌కోచ్ కోచ్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు.
మళ్లీ అదే మాట.. కుండబద్దలు కొట్టిన గంభీర్
ఇంగ్లండ్ పర్యటనలో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి.. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆడించడం తన కోచింగ్ కెరీర్‌లో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమని గంభీర్ పునరుద్ఘాటించాడు.
ఏదేమైనా వైభవ్ మరికొంతకాలం బెంచ్‌కే పరిమితకాక తప్పదని మరోసారి కుండబద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో టీమిండియా సిరీస్ ఆరంభానికి ముందు జియోస్టార్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఘోర పరాభవం
కాగా యూకే పర్యటనలో భారత టీ20 జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలుత పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయింది.
ఇక ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20లో విఫలమైన సంజూను పక్కనపెట్టిన యాజమాన్యం.. ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా వైభవ్‌ను అరంగేట్రం చేయించింది. అయితే, అతడు వరుసగా విఫలం కావడంతో మళ్లీ ఐదో టీ20లో సంజూను ఆడించింది.
వైభవ్ బెంచ్‌కే పరిమితం
ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లగా.. సంజూకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చి.. అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా వైభవ్‌ను దించారు. జింబాబ్వే మీద విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. అయితే, ఆ తర్వాత స్వదేశంలో ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో సంజూ ఆడగా.. వైభవ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
చదవండి: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. కెప్టెన్ సెంచరీ! ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్


