source: X
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఘనంగా బోణీ కొట్టింది. ఆతిథ్య జపాన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘన్ గెలుపులో యువ లెగ్‌స్పిన్నర్ అరబ్ గుల్ మొమంద్ కీలక పాత్ర పోషించాడు.
అంతర్జాతీయ అరంగేట్రంలోనే రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో గుల్ రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 19 డాట్ బాల్స్ సహా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం.
జపాన్ జట్టుపై ఏ అంతర్జాతీయ క్రికెటర్‌కు అయినా ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఈ రికార్డు ఇండోనేషియాకు చెందిన కేతుత్ ఆర్టవాన్ (4/12) పేరిట ఉండేది. తాజాగా గుల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆ రికార్డు బద్దలు కొట్టాడు.
జపాన్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
* అరబ్ గుల్ మొమంద్ – 4/8
* కేతుత్ ఆర్టవాన్ – 4/12
* టియాన్ సేన్ కున్ – 4/12
* ఎన్ నిపికో – 4/17
* అలీ దావూద్ – 4/19
మ్యాచ్ విషయానికొస్తే.. గుల్‌తో పాటు ఖరోటి (3.3-0-19-3), అబ్దుల్లా అహ్మద్‌జాయ్ (3-0-13-2) రెచ్చిపోవడంతో జపాన్ 19.3 ఓవర్లలో 81 పరుగులకే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో జపాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోర్.
ఎవరీ గుల్..?
21 ఏళ్ల అరబ్ గుల్ మొమంద్ 2024 అండర్-19 ప్రపంచకప్‌లో క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు తీసిన గుల్.. ఐర్లాండ్-ఏతో జరిగిన మరో మ్యాచ్‌లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్రదర్శనల తర్వాత గుల్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ అవకాశాలు లభించాయి. ఎంఐ ఎమిరేట్స్, బార్బడోస్ రాయల్స్ వంటి జట్లకు సంబంధించిన స్క్వాడ్లలో అతడు చోటు దక్కించుకున్నాడు.
ఇదీ చదవండి: మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..?


