థాయ్‌లాండ్‌పై 20–1తో గెలిచిన భారత మహిళల హాకీ జట్టు
ఆసియా క్రీడల మహిళల హాకీ ఈవెంట్‌లో భారత జట్టు ఒకవైపు గోల్స్ వర్షం కురిపిస్తూ... మరోవైపు తమ విజయపరంపర కొనసాగిస్తోంది. పూల్ ‘బి’లో భాగంగా బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 20–1 గోల్స్ తేడాతో థాయ్‌లాండ్‌ను చిత్తుగా ఓడించింది. భారత స్టార్ ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక సెహ్రావత్ ఈసారి 9 గోల్స్‌తో చెలరేగిపోయింది.
ఉజ్బెకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో 8 గోల్స్ కొట్టిన దీపిక... ఇండోనేసియాతో మ్యాచ్‌లో 3 గోల్స్ సాధించింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో దీపిక చేసిన 9 గోల్స్ (2వ, 8వ, 9వ, 24వ, 33వ, 36వ, 39వ, 51వ, 57వ ని.లో) పెనాల్టీ కార్నర్‌ల ద్వారానే రావడం విశేషం. ఈ క్రమంలో దీపిక ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ చేసిన మహిళా హాకీ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 8 గోల్స్‌తో తన పేరిటే ఉన్న రికార్డును దీపిక సవరించింది.
నవ్‌నీత్ కౌర్ (4వ, 29వ, 35వ, 51వ ని.లో) నాలుగు గోల్స్... రుతుజా (10వ, 11వ, 47వ ని.లో మూడు గోల్స్ చేశారు. నేహా (19వ ని.లో), లాల్‌రెమ్‌సియామి (26వ ని.లో), సాక్షి (29వ ని.లో), సలీమా టెటె (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 23 పెనాల్టీ కార్నర్‌లు రాగా... పదింటిని గోల్స్‌గా మలిచింది. శుక్రవారం జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది.


