మీరా కల నెరవేరె... | Mirabai Chanu wins silver in weightlifting in Asian Games 2026 | Sakshi
Sakshi News home page

మీరా కల నెరవేరె...

Sep 24 2026 4:16 AM | Updated on Sep 24 2026 4:16 AM

Mirabai Chanu wins silver in weightlifting in Asian Games 2026

వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు రజతం

తొలిసారి ఆసియా క్రీడల పతకం నెగ్గిన భారత స్టార్‌ లిఫ్టర్‌ 

నాలుగో రోజు భారత్‌కు మొత్తం 5 పతకాలు 

స్కీట్‌ షూటర్లకు రెండు కాంస్యాలు

బ్యాడ్మింటన్, సాఫ్ట్‌ టెన్నిస్‌లో కూడా కంచు మోత

ఒలింపిక్స్‌ స్వర్ణం, పసిడి సహా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు మెడల్స్, కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు బంగారు పతకాలు... వీటికి తోడు ఆసియా చాంపియన్‌ షిప్, కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లలో కూడా మరో ఆరు పతకాలు... కానీ ఇన్నేళ్లపాటు ఆసియా క్రీడల పతకం మాత్రం ఆమె మెడను వరించలేదు... కానీ ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. భారత టాప్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో రజత పతకంతో తొలిసారి ఈ పోటీల్లో పోడియంపై  నిలిచి సంబరం చేసుకుంది. 

ఏషియాడ్‌లో పోటీల నాలుగో రోజు బుధవారం భారత్‌ మొత్తం ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌ పురుషుల, మహిళల స్కీట్‌ టీమ్‌ ఈవెంట్లలో కాంస్యాలు దక్కగా... పురుషుల బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌ సెమీస్‌లో ఓడిన భారత బృందం కాంస్యంతో సరిపెట్టుకుంది. సాఫ్ట్‌ టెన్నిస్‌లో తొలిసారి కాంస్యం రూపంలో పతకం లభించగా... కచ్చితంగా పతకాలు సాధిస్తారని భావించిన మహిళా పిస్టల్‌ షూటర్ల వైఫల్యం భారత బృందాన్ని షాక్‌కు గురి చేసింది.  

నగోయా: భారత టాప్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను కల నెరవేరింది. తన అద్భుత కెరీర్‌లో లోటుగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని గెలుచుకొని ఆమె తన ఘనతను పరిపూర్ణం చేసుకుంది. బుధవారం జరిగిన మహిళల 49 కేజీల ఈవెంట్‌లో మీరాబాయి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీల బరువెత్తిన మీరా మొత్తం 198 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర కొరియాకు చెందిన రీ సంగ్‌ గుమ్‌ (మొత్తం 215 కేజీలు) స్వర్ణం, విజయాన లులుక్‌ (ఇండోనేసియా; 191 కేజీలు) కాంస్యం దక్కించుకున్నారు. 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో కరణం మల్లీశ్వరి రజతం గెలుచుకున్న తర్వాతి వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం.  

తన చిరకాల స్వప్నం నెరవేర్చుకునే క్రమంలో మీరాబాయి ఈసారి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా బరువెత్తింది. స్నాచ్‌లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ మూడు ప్రయత్నాల్లో వరుసగా 83 కేజీలు, 85 కేజీలు, 87 కేజీల బరువెత్తింది. ఆ తర్వాత క్లీన్‌ అండ్‌ జర్క్‌లో తొలి ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తిన ఆమె తన రెండో ప్రయత్నంలో మరింత మెరుగ్గా 111 కేజీలతో ముగించింది. వెండి పతకం ఖాయం కావడంతో ఆమె మూడో ప్రయత్నం చేయలేదు. 

మరోవైపు రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన రీ సంగ్‌ గుమ్‌ తనపై ఉన్న అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి మూడు కొత్త ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టి మరీ పసిడి గెలుచుకుంది. విడిగా స్నాచ్‌లో 94 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 121 కేజీలతో పాటు ఓవరాల్‌గా 215 కేజీలతో ఆమె ప్రపంచ రికార్డులు నెలకొల్పడం విశేషం. 2018, 2022 ఆసియా క్రీడల్లో కూడా పసిడి పతకం గెలుచుకున్న ఆమెకు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం గమనార్హం.

పుష్కర కాలపు పతకం  
2014 ఆసియా క్రీడల్లో 9వ స్థానం... 2018లో వెన్ను గాయం కారణంగా పోటీల నుంచి ముందే తప్పుకున్న పరిస్థితి... 2023 క్రీడల్లో మెరుగైన ప్రదర్శనే ఇచ్చినా కీలక సమయంలో గాయంతో చేజారిన పతకం... నాలుగో స్థానంతో సరి! భారత వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ఆసియా క్రీడల ప్రదర్శన ఇది. 12 ఏళ్ల క్రితం తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన ఆమె గత మూడు అవకాశాల్లోనూ పతకాన్ని అందుకోలేకపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకొని తన స్థాయిని పెంచుకున్న మీరాపై తర్వాతి క్రీడల్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే దురదృష్టవశాత్తూ ఆమె వాటిని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు తన స్థాయికి తగిన ప్రదర్శనతో ఆసియా క్రీడల పతకం గెలుచుకొని ఈ మణిపూర్‌ బిడ్డ సగర్వంగా నిలిచింది. ఆరుగురు పిల్లల కుటుంబంలో అందరికంటే చిన్నది అయినా... తనకంటే పెద్దయిన అన్నలకూ సాధ్యంకాని రీతిలో కట్టెల మోపులను అలవోకగా ఎత్తుతూ ఆశ్చర్యపర్చిన ఈ అమ్మాయి ఇప్పుడు బరువులెత్తడంలో ప్రపంచాన్ని గెలిచి చూపించింది. ప్రస్తుతం మణిపూర్‌ పోలీసు విభాగంలో మీరాబాయి అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తోంది.  

ఒలింపిక్‌ రింగ్స్‌ నమూనాతో అమ్మ ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చిన చెవి రింగులు, మూడు రంగుల రిబ్బన్‌తో జుట్టుకు ముడి, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో మీరా స్టేజ్‌ మీదకు వచ్చింది. స్నాచ్‌లో ఇండోనేసియా ప్రత్యర్థికంటే ఒక కేజీ వెనుకబడిన మీరాకు క్లీన్‌ అండ్‌ జర్క్‌లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం కలిగింది. దాంతో రెండో ప్రయత్నంలో 111 కేజీలకు గురి పెట్టిన ఆమె ఈ బరువునెత్తడంలో సఫలమైంది. తన సాధనను సరైన రీతిలో ప్రదర్శిస్తూ పతకంతో ముగించింది.  ప్రస్తుతం 32 ఏళ్ల వయసు ఉన్న తనకు ఇంతకంటే మంచి అవకాశం రాదని మీరాకు బాగా తెలుసు. అందుకే ఈసారి అన్ని రకాలుగా పోటీకి సన్నద్ధమై ఆమె వచ్చింది. కోచ్‌ విజయ్‌ శర్మ మరోసారి ఈ ప్రయాణంలో మీరాకు అండగా నిలిచారు. 

ఇటీవలే కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తర్వాత ఆమె అసలు విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజునుంచే తన ప్రాక్టీస్‌ మొదలు పెట్టడం ఆమె ఏషియాడ్‌ పతకం విషయంలో ఎంత పట్టుదలగా ఉందో చూపించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత ఒలింపిక్స్, వరల్డ్‌ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన రెండో భారతీయురాలిగా ఇప్పుడు మీరాబాయి తన పేరుకు శాశ్వత కీర్తిని తెచ్చుకుంది. 20 ఏళ్ల వయసులో కామన్వెల్త్‌ క్రీడల్లో తన తొలి పతకం (రజతం) సాధించి భారత్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో తన గెలుపు ప్రస్థానాన్ని మొదలు పెట్టిన మీరా... పుష్కర కాలం తర్వాత తన విజయయాత్రలో శిఖరానికి చేరింది.  

గత 12 ఏళ్లుగా ఈ పతకం కోసం ప్రయత్నిస్తున్నా. వేర్వేరు కారణాలతో అది దక్కలేదు. కానీ ఇప్పుడు నా కల తీరింది. తాజా ఫలితంతో నా మనసు తేలికపడింది. ఇక్కడికి వచ్చే ముందు ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక్కడ నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. నా నుంచి చాలా మంది పతకాన్ని ఆశించారు. కాబట్టి కొంత ఒత్తిడి ఉన్నా నా బలాన్ని నమ్ముకున్నాను. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆసియా నుంచే పెద్ద ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడి పతకం కూడా దాదాపుగా ఒలింపిక్‌తో సమానం. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 111 కేజీలకంటే తక్కువ బరువు ఎత్తినా రజతం దక్కుతుందని నాకు అర్థమైంది. అయినా సరే ఎలాంటి అవకాశం ఇవ్వరాదని ఆ మొత్తానికి ప్రయత్నించా. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తా. నాకిష్టమైన పిజ్జా తింటా... ఆ తర్వాతే 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల గురించి ఆలోచిస్తా. డిసెంబర్‌లో జరిగే క్వాలిఫయింగ్స్‌ నుంచి నా సన్నద్ధత మొదలవుతుంది.  –మీరాబాయి చాను  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement