భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తన అద్భుత కెరీర్‌లో లోటుగా ఉన్న ఆసియా క్రీడల పతకాన్ని ఎట్టకేలకు సొంతం చేసుకుంది. జపాన్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్‌లో మహిళల 49 కేజీల విభాగంలో ఆమె రజత పతకం సాధించడంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
అంతేకాకుండా 28 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించిన తొలి అథ్లెట్‌గా మీరాబాయి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై మీరాబాయి చాను సాధించిన విజయాలు, అందుకున్న పురస్కారాలు, బహుమతుల వివరాలను తెలుసుకుందాం.
కష్టానికి దక్కిన ప్రతిఫలం
మీరాబాయిఆదాయంలో ప్రధాన భాగం అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించినప్పుడు లభించిన నగదు బహుమతుల నుంచే వచ్చిందే కావడం గమనార్హం. ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న తర్వాత ఆమెకు అత్యధిక మొత్తంలో ఆర్థిక ప్రోత్సాహకాలు లభించాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడంతో వచ్చిన నగదు బహుమతులు ఇవే
భారతీయ రైల్వేస్: రూ. 2 కోట్లు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం: రూ. 1.5 కోట్లు
మణిపూర్ ప్రభుత్వం: రూ. 1 కోటి
బైజూస్ : రూ. 1 కోటి
బీసీసీఐ : రూ. 50 లక్షలు
భారత ఒలింపిక్ సంఘం: రూ. 40 లక్షలు
జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ : రూ. 20 లక్షలు
👉మొత్తంగా టోక్యో ఒలింపిక్స్ అనంతరం ఆమెకు మొత్తంగా రూ. 6.6 కోట్లు లభించాయి.
అలాగే ఈ ఏడాది గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మీరాబాయిని మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ. 20 లక్షల నగదు బహుమతితో పాటు గుర్తింపు పత్రం కూడా అందజేశారు.
కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఆమెను సన్మానించడంతో పాటురూ. 30 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో రజత పతకం సాధించడంతో మరిన్ని నగదు పురష్కారాలు లభించే ఛాన్స్ ఉంది.
హోదాలు- ఉద్యోగాలు
టోక్యో ఒలింపిక్స్ అనంతరం అప్పటికే ఈశాన్య రైల్వేలో పనిచేస్తున్న మీరాబాయ్‌ను 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' గా ప్రమోట్ చేశారు. అప్పటి మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఆమెను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు. అప్పట్లో రైల్వే ఉద్యోగాన్ని వదిలి మణిపూర్ పోలీస్ శాఖలో చేరేందుకు మీరాబాయి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మీరాబాయి చాను.. అడిడాస్, అమ్‌వే - న్యూట్రిలైట్, స్టార్ సిమెంట్, అమృతాంజన్, డొమినోస్ వంటి పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
క్రీడారంగంలో మీరాబాయి చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అనేక అత్యున్నత పౌర, క్రీడా పురస్కారాలతో గౌరవించింది. పద్మశ్రీ, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వంటి అవార్డ్‌లను సొంతం చేసుకుంది.


