Asian Games 2026: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను | Asian Games 2026: Mirabai Chanu Clinches Historic Silver | Sakshi
Sakshi News home page

Asian Games 2026: చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

Sep 23 2026 11:56 AM | Updated on Sep 23 2026 11:59 AM

Asian Games 2026: Mirabai Chanu Clinches Historic Silver

source: X

2026 ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పరంపర కొనసాగుతోంది. తొలి మూడు రోజులు షూటర్లు ఆధిపత్యం చలాయించగా.. ఇప్పుడిప్పుడే ఇతర క్రీడల అథ్లెట్లు పతకాలు సొంతం చేసుకుంటున్నారు. నాలుగో రోజు కూడా షూటర్లే బోణీ కొట్టినప్పటికీ.. ఈ రోజుకి అతి పెద్ద పతకం మాత్రం వెయిట్‌ లిఫ్టింగ్‌లో దక్కింది.

భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌, ఒలింపిక్‌ పతక విజేత మీరాబాయి చాను, మహిళల 49 కేజీల విభాగంలో రజత పతకం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో చానుకు ఇదే తొలి పతకం. దీంతో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ పతక నిరీక్షణకు ఆమె తెరదించింది.

సాఫ్ట్‌ టెన్నిస్‌లో భారత్‌కు తొలి పతకం
పురుషుల సింగిల్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌లో జయ్‌ మీనా సెమీఫైనల్‌కు చేరి భారత్‌కు చారిత్రాత్మక పతకాన్ని ఖాయం చేశాడు. అయితే సెమీఫైనల్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. దీంతో జయ్‌ మీనాకు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఆసియా క్రీడల సాఫ్ట్‌ టెన్నిస్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం.

స్కీట్‌లో డబుల్‌ బ్రాంజ్‌
అంతకుముందు షూటింగ్‌లో భారత జట్టు మరో రెండు పతకాలు సాధించింది. మహిళల స్కీట్‌ టీమ్‌ విభాగంలో రైజా ధిల్లాన్‌, పరినాజ్‌ ధలివాల్‌, మహేశ్వరి చౌహాన్‌ కాంస్య పతకం గెలిచారు.

పురుషుల స్కీట్‌ టీమ్‌ విభాగంలో అనంత్‌జీత్‌ సింగ్‌ నరూకా, మైరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, భవ్‌తేజ్‌ సింగ్‌ గిల్‌ కాంస్యం సాధించారు. అనంత్‌జీత్‌ సింగ్‌ వ్యక్తిగత స్కీట్‌ ఫైనల్‌కు కూడా అర్హత సాధించాడు.

మను బాకర్‌కు నిరాశ
మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో భారత్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. టీమ్‌ విభాగంలో మను బాకర్‌, సురుచి ఇందర్‌ సింగ్‌, ఇషా సింగ్‌ల భారత జట్టు నాలుగో స్థానంతో పతకాన్ని చేజార్చుకుంది. వ్యక్తిగత ఫైనల్లోనూ మను బాకర్‌ ఐదో స్థానంలో నిలిచి పతకం లేకుండానే ముగించింది.

కబడ్డీలో భారత్‌ విజయం
మహిళల కబడ్డీలో భారత జట్టు గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఇరాన్‌పై 37-23తో విజయం సాధించింది. మరోవైపు రోయింగ్‌, కెనో స్ప్రింట్‌, టేబుల్‌ టెన్నిస్‌, సెపక్‌తక్రా విభాగాల్లోనూ భారత క్రీడాకారులు తదుపరి రౌండ్లకు పురోగమించారు. ఇప్పటివరకు భారత్‌ ఖాతాలో 11 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 5 కాంస్యాలు) చేరాయి. ప్రస్తుతం పట్టికలో భారత్‌ 10వ స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మను బాకర్‌కు నిరాశ.. షూటింగ్‌లో భారత్‌కు డబుల్‌ బ్రాంజ్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement