PC: X
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ అండర్-19 జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత యువ జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జెడ్ హోలిక్(87), నీల్ పటేల్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మోహిత్ ఉల్వ, మోనల్ చౌహన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఆర్యన్ సవసాని, కావ్య పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
కెప్టెన్ అజేయ సెంచరీ
అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్యవీర్ కేవలం 31 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యవీర్ ఔటయ్యాక కెప్టెన్ లక్ష్య రాయ్‌చందన్ ఆసీస్ బౌలర్లను టార్గెట్ చేశాడు. రాచ్‌చందన్ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకు పంపాడు. ఈ క్రమంలో రాయ్‌చందన్ 100 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
ఓవరాల్‌గా 106 బంతులు ఎదుర్కొన్న లక్ష్య రాయ్‌చందన్.. 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరితో పాటు కుశాగ్ర ఓఝా(45), రజత్ బఘేల్(44 నాటౌట్) కూడా రాణించారు. ఫలితంగా ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 41.2 ఓవర్లలో చేధించింది. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: ICC T20 Rankings: ప్రపంచ నెం1 వన్ బౌలర్‌గా పాకిస్తాన్ స్టార్.. ఇదే తొలిసారి


