ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత యువ జట్టు.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో కంగారూలను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేసింది.
ఆసీస్ ఆలౌట్
నిరంజన్ షా స్టేడియం వేదికగా మూడో యూత్ వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో చార్లీ హెండెర్‌సన్ (18) విఫలం కాగా.. జెడ్ హాలిక్ అద్భుత అర్ధ శతకం (87) సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నీల్ పటేల్ కూడా హాఫ్ సెంచరీ (51) చేశాడు.
మిగిలిన వారిలో బ్లేక్ కాటిల్ (38) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగిలిన వాళ్లంతా తేలిపోయారు. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా ఆసీస్ యువ జట్టు 49.3 ఓవర్లలో 254 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
తొలి వికెట్‌కు 58 పరుగులు
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత అండర్-19 జట్టుకు మెరుగైన ఆరంభమే లభించింది. ఓపెనర్లు లక్ష్య రాయ్‌చందాని, ఆర్యవీర్ సెహ్వాగ్ కలిసి తొలి వికెట్‌కు 47 బంతుల్లో 58 పరుగులు జోడించారు. అయితే, ఆర్యవీర్ సెహ్వాగ్ అర్ద శతకం దిశగా పయనిస్తున్న వేళ అనూహ్య రీతిలో అవుటయ్యాడు.
ఆది నుంచే దూకుడు.. బౌండరీలతో విధ్వంసం
ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ తొలి ఓవర్ నుంచే దూకుడు ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ ఐదో బంతికే ఫోర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మూడో ఓవర్లో రెండుసార్లు బంతిని బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లోనూ ఇదే పునరావృతం చేశాడు.
ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్లో ఆసీస్ బౌలర్ జేకబ్ పీట్జ్ బంతితో రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి షాట్ ఆడబోయిన ఆర్యవీర్.. మాథ్యూ లాఫ్‌నకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆర్యవీర్ అవుట్ కాగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
హాఫ్ సెంచరీ చేయకుండానే
ఆసీస్‌తో మూడో యూత్ వన్డేలో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్ సెహ్వాగ్.. ఐదు ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. కాగా ఆర్యవీర్.. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు అన్న సంగతి తెలిసిందే.
ఆసీస్ అండర్-19 జట్టుతో వన్డే సిరీస్ సందర్భంగా తొలిసారి భారత యువజట్టుకు ఎంపికైన ఆర్యవీర్.. తొలి మ్యాచ్‌లో 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు. రెండో యూత్ వన్డేలో అర్ధ శతకం (48 బంతుల్లో 47) మిస్సయ్యాడు. తాజాగా మరోసారి హాఫ్ సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సిరీస్‌ను యువ భారత్ 2-0తో కైవసం చేసుకుంది.


