PC: X
భారత సీనియర్ క్రికెట్ జట్టు వైపు మరో యువ సంచలనం దూసుకొస్తున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో మరో వైభవ్ సూర్యవంశీని తలపిస్తున్నాడు. అతడే భారత అండర్-19 జట్టు ఆటగాడు యశ్‌వర్ధన్ సింగ్ చౌహాన్. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనాధికారిక వన్డే సిరీస్‌లో యశ్‌వర్ధన్ దుమ్మురేపుతున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటిన యశ్‌వర్ధన్, ఇప్పుడు రెండో వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యువ ఆటగాడు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్-డౌన్ బ్యాటర్ వి.కె. వినీత్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 100 బంతులు ఎదుర్కొన్న యశ్‌వర్ధన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత యువ జట్టు నిర్ణీత ఓవర్లలో 341 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఈ 'యంగ్ సెన్సేషన్' గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.
ఎవరీ యశ్‌వర్ధన్?
రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన యశ్‌వర్ధన్ సింగ్, 2009 ఏప్రిల్ 19న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జన్మించాడు. అయితే అతడు పెరిగింది మాత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో. ఈ 17 ఏళ్ల క్రికెటర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
యశ్‌వర్ధన్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి అనామి సింగ్ చౌహాన్ కూడా ఒక క్రికెటరే కావడం విశేషం. లెగ్ స్పిన్నర్ అయిన అనామి గొప్ప క్రికెటర్ కావాలని కలలు కనేవాడు, కానీ అతడు క్లబ్ క్రికెట్ స్థాయిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు తండ్రి కలను కొడుకు యశ్‌వర్ధన్ నిజం చేస్తున్నాడు.
మొన్నటి వరకు గ్వాలియర్‌లోని సింధియా స్కూల్ క్లాస్‌రూమ్‌లో చివరి వరుసలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ ప్లాన్‌లు వేసుకునే యశ్‌వర్ధన్, ఇప్పుడు ఏకంగా భారత అండర్-19 జట్టును నడిపించే స్థాయికి చేరుకున్నాడు.
ఈ ఏడాది జూన్‌లో శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టు సారథిగా వ్యవహరించిన యశ్‌వర్ధన్, త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే అనాధికారిక టెస్టు సిరీస్‌లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశ్‌వర్ధన్ సింగ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, అతి త్వరలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
చదవండి: ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం


