source: X
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఏ మహిళల జట్టుతో ఇవాళ జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత-ఏ జట్టు కెప్టెన్ యస్తిక భాటియా మెరుపు శతకంతో విరుచుకుపడింది. కేవలం 76 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసింది. మొత్తంగా 84 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 112 పరుగులు చేసి ఔటైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భాటియా సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా భారత ప్లేయర్లలో తేజల్ హసబ్నిస్ (60), అనుష్క శర్మ (60 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించగా.. ఓపెనర్లు తనిష సింగ్ 37, ప్రియా పూనియా 36, మిన్నూ మణి 3, సయాలీ సత్ఘరే 12 (నాటౌట్) పరుగులు చేశారు. నికి ప్రసాద్ డకౌటైంది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, మిల్లీ ఇల్లింగ్‌వర్త్ 2, లిల్లీ మిల్స్ ఓ వికెట్ తీశారు.
కాగా, ఆస్ట్రేలియా-ఏ మహిళల జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆతర్వాత ప్రారంభమైన వన్డే సిరీస్‌లో భారత్ ఇప్పటికే తొలి వన్డేలో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్ట్.. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ప్లేయర్


