పసికూన కూడా వణికించింది!.. టీమిండియాపై దిగ్గజ క్రికెటర్‌ ఫైర్‌ | IND vs JPN T20I: Ashwin Slams Indian Batters After Japan Scare | Sakshi
Sakshi News home page

పసికూన కూడా వణికించింది!.. టీమిండియాపై దిగ్గజ క్రికెటర్‌ ఫైర్‌

Sep 23 2026 1:12 PM | Updated on Sep 23 2026 1:39 PM

IND vs JPN T20I: Ashwin Slams Indian Batters After Japan Scare

Photo Credit: BCCI X

జపాన్‌తో చారిత్రక టీ20 మ్యాచ్‌లో టీమిండియా కొద్దిలో బతికిపోయింది! క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్న పసికూన చేతిలో ఓటమికి చేరువగా వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సేన ఆఖరికి రెండు పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కి.. ‘అవమానకర విజయాన్ని’ సొంతం చేసుకుంది.  

కష్టాలు తప్పవు
ఈ నేపథ్యంలో భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఫ్లాట్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడానికి అలవాటు పడ్డ భారత బ్యాటర్లు.. విదేశీ పిచ్‌లపై తేలిపోతున్నారు అనడానికి ఇది మరో నిదర్శనం అన్నాడు.

తదుపరి న్యూజిలాండ్‌ పర్యటనలోనూ శ్రేయస్‌ అయ్యర్‌ సేనకు ఇలాంటి తిప్పలు తప్పవని అశూ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘పిచ్‌ ఫ్లాట్‌గా లేదు కాబట్టి భారత బ్యాటింగ్‌ లైనప్‌ బాగా ఇబ్బంది పడినట్లు కనిపించింది.

ఇండియాలో ఐపీఎల్‌లో ఎక్కువగా రోడ్‌ మాదిరి ఉండే ఫ్లాట్‌ పిచ్‌లే రూపొందిస్తారు. కాబట్టి ప్రత్యర్థి జట్లు ఇందుకు భిన్నమైన పిచ్‌లు రూపొందించి టీమిండియాను దెబ్బకొడుతున్నాయి. అందుకే మన బ్యాటర్లు జపాన్‌లో తేలిపోయారు. ఐపీఎల్‌లో మనోళ్లు ఎలాంటి పిచ్‌లపై ఆడుతున్నారో అందరూ చూస్తున్నారు కదా!

కివీస్‌ ఒక తెలివైన జట్టు
తదుపరి న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆడాల్సి ఉంది. కివీస్‌ ఒక తెలివైన జట్టు. వాళ్లు కూడా జపాన్‌లో మాదిరి పిచ్‌నే తయారు చేసి.. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో మొత్తం ఇలాంటి స్లో వికెట్లే రూపొందించడానికి ఎంతో కాలం పట్టదు. 

అక్కడ కూడా బంతి టర్న్‌ అవడం మొదలవుతుంది చూడండి. ఎందుకంటే టీ20 క్రికెట్‌ ఆడే మన క్రికెటర్ల బలహీనతలు ఏమిటో వారు సరిగ్గా పసిగడుతున్నారు’’ అని అశ్విన్‌ టీమిండియాను విమర్శించాడు.

బంతి బాగా టర్న్‌ కావడంతో
కాగా సానో అంతర్జాతీయ స్టేడియం వేదికగామంగళవారం వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన  ఏకైక టీ20లో భారత్‌ 2 పరుగుల తేడాతో జపాన్‌పై విజయం సాధించింది. 

బంతి బాగా టర్న్‌ అవుతూ బ్యాటింగ్‌కు అసలు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై టాస్‌ గెలిచిన భారత్‌ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (12 బంతుల్లో 16; 1 ఫోర్‌) టాప్‌ స్కోరర్‌.

అనంతరం జపాన్‌ 5 ఓవర్లలో 3 వికెట్లకు 30 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ కెండెల్‌ కడోవాకి (12)దే అత్యధిక స్కోరు. మ్యాచ్‌లో స్పిన్నర్లే అన్ని ఓవర్లూ వేయగా ... ఇరు జట్లు కలిపి 60 బంతుల్లో 4 ఫోర్లే కొట్టగలిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

చదవండి: IND vs JPN: ఆఖర్లో హైడ్రామా.. వైడ్‌ ఇచ్చి ఉంటే.. టీమిండియా కొంపమునిగేది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement