‘వైడ్‌’పై వివాదం! | India vs Japan T20I Axar Patel wide ball controversy | Sakshi
Sakshi News home page

‘వైడ్‌’పై వివాదం!

Sep 23 2026 4:28 AM | Updated on Sep 23 2026 4:29 AM

India vs Japan T20I Axar Patel wide ball controversy

అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌కు సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా... భారత్, జపాన్‌ దేశాల మధ్య ‘ఫ్రెండ్లీ’ సంబంధాల నేపథ్యంలో నిర్వహించిన టి20 మ్యాచ్‌లో అనవసరపు వివాదం భారత్‌ గెలుపును పలుచన చేసింది. అక్షర్‌ వేసిన చివరి ఓవర్లో ఒక ‘వైడ్‌’ అందుకు కారణమైంది. గెలుపు కోసం 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో జపాన్‌ నిలిచింది. అక్షర్‌ వేసిన బంతి బ్యాటర్‌ షిరాయ్‌ లెగ్‌సైడ్‌కు వెళ్లగా అతను రివర్స్‌ స్వీప్‌నకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అంపైర్‌ క్రిస్‌ టర్‌గెట్‌ దీనిని వైడ్‌గా ప్రకటించాడు. 

అక్షర్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా, కెప్టెన్‌ శ్రేయస్‌ కూడా మరో అంపైర్‌ క్రిస్‌ బ్రౌన్‌తో వాదించాడు. అంపైర్లిద్దరూ చర్చించిన తర్వాత ఆ వైడ్‌ను వెనక్కి తీసుకుంటూ సరైన బంతిగా ప్రకటించారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారగా, జపాన్‌ 3 సింగిల్స్‌ తీసి ఓడింది. నిబంధనల ప్రకారం అంపైర్‌ నిర్ణయంలో తప్పేమీ లేదు. ఐసీసీ నియమావళి ప్రకారం బ్యాటర్‌ రివర్స్‌ స్వీప్‌ లేదా స్విచ్‌ హిట్‌ చేయడానికి ప్రయత్నిస్తే అతని లెగ్‌ సైడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా రెండు వైపులనూ ఆఫ్‌సైడ్‌గానే పరిగణిస్తూ ఆఖరి స్టంప్‌ నుంచి 75 సెంటీమీటర్లు దూరంగా వెళితే వైడ్‌గా ఇవ్వాల్సిందే. 

పెద్దగా అనుభవం లేని జపాన్‌ అంపైర్‌ క్రిస్‌కు మరోవైపు నుంచి ఐసీసీ ఎలీట్‌ ప్యానెల్‌ అంపైర్‌ బ్రౌన్‌ ఇది వివరించి ఉంటాడు. దాంతో అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు థర్డ్‌ అంపైర్, రివ్యూలు లేవు కాబట్టి తర్వాతి బంతి వేసే లోపే అంపైర్‌ తన నిర్ణయం మార్చుకోవచ్చు. అయితే శ్రేయస్‌ నిరసనతో భారత్‌ ఏదో ఒత్తిడి తెచ్చినట్లు కనిపించిందే తప్ప వైడ్‌ ఇవ్వకపోవడం సరైందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement