క్వార్టర్ ఫైనల్లో 3–0తో గెలిచిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు
సెమీఫైనల్ బెర్త్‌తో పతకం కూడా ఖాయం
నగోయా: ఆతిథ్య జపాన్ జట్టుకు షాక్ ఇస్తూ భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన టీమ్ ఈవెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 3–0తో జపాన్ జట్టును బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. జపాన్‌తో జరిగిన పోరులో తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 14వ ర్యాంకర్ లక్ష్య సేన్ 66 నిమిషాల్లో 11–21, 21–5, 21–19తో ప్రపంచ 7వ ర్యాంకర్, రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కొడాయ్ నరోకాను ఓడించి సంచలనం సృష్టించాడు.
రెండో మ్యాచ్‌గా జరిగిన డబుల్స్ సమరంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 56 నిమిషాల్లో 21–18, 24–22తో ప్రపంచ మాజీ చాంపియన్స్ హోకి టకురో–కొబయాషి యుగో జంటను బోల్తా కొట్టించింది. మూడో మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–10, 21–19తో ప్రపంచ 16వ ర్యాంకర్ కొకి వతనాబెపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని కట్టబెట్టాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లు నిర్వహించలేదు.
భారత మహిళల జట్టుకు నిరాశ
మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకం సాధించలేకపోయింది. జపాన్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 72 నిమిషాల్లో 23–21, 18–21, 11–21తో ప్రపంచ 3వ ర్యాంకర్ అకానె యామగుచి చేతిలో పోరాడి ఓడిపోయింది.
రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 16–21, 18–21తో ప్రపంచ 7వ ర్యాంకర్ టొమోకా మియజాకి చేతిలో ఓటమి పాలైంది.. మూడో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–17, 21–16తో యూకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో జంటపై గెలిచింది. అయితే నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ 12–21, 10–21తో ప్రపంచ 10వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది.


