స్మృతి మంధాన (PC: BCCI X)
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించింది. ఆసియా క్రీడలు-2026 టీ20 టోర్నమెంట్లో భాగంగా శ్రీలంకతో పసిడి పతక పోరు సందర్భంగా.. స్మృతి ఈ ఘనత సాధించింది.
జపాన్‌లోని నిశిన్ వేదికగా కరోగి స్పోర్ట్స్ పార్కులో మంగళవారం నాటి ఫైనల్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలి వర్మ శుభారంభం అందించారు. స్మృతి దూకుడుగా మొదలుపెట్టగా.. కాస్త సమయం తీసుకున్న షఫాలి ఆ తర్వాత వేగం అందుకుంది.
ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 60 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, తొమ్మిదో ఓవర్లో చముది ప్రబోద బౌలింగ్‌లో కావ్యా కవిందికి క్యాచ్ ఇచ్చి షఫాలీ తొలి వికెట్‌గా వెనుదిరగగా.. స్మృతి మాత్రం జోరు కొనసాగించింది. ప్రబోద బౌలింగ్‌లో రెండో బంతికి సింగిల్ తీసి యాభై పరుగుల మార్కును అందుకుంది.
కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో స్మృతికి ఇది 37వ అర్ధ శతకం కావడం విశేషం. కేవలం 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. దురదృష్టవశాత్తూ సెంచరీ మార్కు అందుకోలేకపోయింది. సుగందిక కుమారి బౌలింగ్‌లో కవిశా దిల్హరికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న స్మృతి ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసింది. ఇక మిగిలిన వారిలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 19) నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
కేవలం 22 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 49 పరుగులతో అజేయంగా నిలిచింది రిచా. ఇక భారతి ఫుల్మలి ఏడు బంతుల్లో 7 పరుగులతో రిచాకు తోడుగా నిలవగా.. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కవిశా దిల్హరి, చముది ప్రబోద తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.


