ఇరాన్‌ విమానాలకు అమెరికా షాక్.. 23 నుంచి కఠిన ఆంక్షలు! | US Threatens Global Aviation Cut Off for Iranian Airlines | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ విమానాలకు అమెరికా షాక్.. 23 నుంచి కఠిన ఆంక్షలు!

Sep 22 2026 8:51 AM | Updated on Sep 22 2026 8:58 AM

US Threatens Global Aviation Cut Off for Iranian Airlines

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమవుతోంది. ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయ విమానయాన వ్యవస్థ నుంచి దూరం చేసే దిశగా అమెరికా కీలక హెచ్చరిక చేసింది. సెప్టెంబర్‌ 23 నుంచి ఇరాన్‌ విమానాలకు ఇంధనం, ల్యాండింగ్‌ సదుపాయాలు, టికెట్‌ విక్రయాలు వంటి సేవలు అందించే విదేశీ సంస్థలపైనా ఆంక్షలు విధించనున్నామని అమెరికా తెలిపింది.

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 23 నుంచి ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా ‘షట్‌డౌన్‌’ చేసే చర్యలు చేపడతామని తెలిపారు. ఇరాన్‌ ఎయిర్‌లైన్స్‌కు సేవలు అందించే విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, టికెట్‌ విక్రయ సంస్థలు కూడా అమెరికా చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌ విమానాలు ఏదైనా దేశంలో దిగితే.. వాటికి ఇంధనం అందించడం, ల్యాండింగ్‌ సదుపాయాలు కల్పించడం లేదా టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించే సంస్థలు కూడా అమెరికా ఆంక్షల పరిధిలోకి వస్తాయని బెస్సెంట్‌ పేర్కొన్నారు. అలాంటి సంస్థలను అమెరికా డాలర్‌ ఆర్థిక వ్యవస్థ నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఇరాన్‌ విమానాలకు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం మరింత కష్టతరం కానుంది.

ఈ తాజా హెచ్చరికకు ముందు సెప్టెంబర్‌ 8న అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్‌ విమానయాన రంగానికి సంబంధించిన 36 లక్ష్యాలపై ఆంక్షలు విధించింది. ఇందులో ఇరాన్‌కు చెందిన 27 విమానయాన సంస్థలు ఉన్నాయి. మిగిలిన ఇరాన్‌ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆంక్షల కార్యక్రమంలో చేర్చినట్లు అమెరికా తెలిపింది. వాటికి మద్దతు అందించే విదేశీ సంస్థలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఇరాన్‌కు చెందిన మహాన్‌ ఎయిర్‌పై అమెరికా గతంలోనే పలు ఆంక్షలు విధించింది. ఆ సంస్థకు ఆర్థిక, లాజిస్టికల్‌, వాణిజ్యపరమైన సహకారం అందిస్తున్నాయని ఆరోపించిన సంస్థలు, వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంది. జూలైలో చైనా, భారత్‌, రష్యా, ఇరాన్‌లకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్‌పై ఆంక్షల అమలుకు సంబంధించి చైనా అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే బెస్సెంట్‌ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరాన్‌కు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉండటంతో.. అమెరికా ఆంక్షల అమలులో చైనా సహకారం కీలకంగా మారింది. చైనా ఆర్థిక అధికారులు, పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా గవర్నర్‌ పాన్‌ గోంగ్‌షెంగ్‌తో చర్చలు జరిగినట్లు బెస్సెంట్‌ తెలిపారు. ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి కేవలం విమానయాన రంగానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆ దేశానికి ఉన్న మార్గాలను కూడా కట్టడి చేసే దిశగా విస్తరిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement