భారీగా పడిపోయిన సీడీయూ ప్రజాదరణ
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఏఎఫ్‌డీ
పదవిని వీడేది లేదంటున్న చాన్స్‌లర్
బెర్లిన్: జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ఆయన సార«థ్యంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీ(సీడీయూ) ప్రజాదరణ మునుపెన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి చేరుకుంది. ఎంజెలా మార్కెల్, కొన్రాడ్ అడెనార్‌ల సారథ్యంలో ఒక వెలుగు వెలిగిన సీడీయూకు ప్రజలు క్రమేపీ దూరమవుతున్నారు. ఇటీవల వరుసగా మూడు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో సీడీయూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
చాన్స్‌లర్ మెర్జ్ ఈ ఫలితాలను మహా విపత్తు అంటూ అభివరి్ణంచడం గమనార్హం. గత 75 ఏళ్ల చరిత్రలో సీడీయూ 1951లో మాత్రమే అత్యంత తక్కువగా, 9 శాతం ఓట్లు సాధించింది. తాజాగా, ఇప్పుడు అంతకంటే ఘోరంగా కేవలం 4.9 శాతం ఓట్లకే పరిమితమైంది. మెక్లెన్‌బర్గ్– వర్‌పొమర్న్ రాష్ట్రం, బెర్లిన్ నగరంలో జరిగిన ప్రాంతీయ ఎన్నికల్లో ఏఎఫ్‌డీ (ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ) ఘన విజయాలు సాధించింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసేంతటి మెజారిటీ సాధించలేకపోయింది.
ఈ ఎన్నికల ద్వారా దేశంలో ప్రధాన రాజకీయ పార్టీ స్థాయికి ఏఎఫ్‌డీ ఎదిగింది. తాజా ఫలితాల నేపథ్యంలో పదవి నుంచి వైదొలుగుతారంటూ వస్తున్న వార్తలను మెర్జ్ తోసిపుచ్చారు. సీడీయూ అధ్యక్షుడిగా, దేశ చాన్స్‌లర్‌గా కొనసాగుతానంటూ స్పష్టత ఇచ్చారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)లో అత్యధిక జనాభా, బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం జర్మనీ. దీర్ఘకాలంగా రాజకీయ స్థిరత్వానికి చిహ్నంగా నిలవడమే కాకుండా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు కీలక మద్దతుదారుగా ఉంది. ఇక్కడ చోటుచేసుకునే రాజకీయ అస్థిరత ప్రభావం యూరప్‌పై పడుతుంది.
మెర్జ్ పాలనా వైఫల్యం
ఈ నెలారంభంలో జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో.. మెర్జ్ పాలనపై కేవలం 13 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. మెర్జ్‌కున్న పేలవమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆవేశం, నియంత్రణ లేకపోవడం వంటి లక్షణాలు ప్రజలను ఆయనకు దూరం చేశాయని విశ్లేషకులు అంటున్నా రు. వీటికితోడు, ఏప్రిల్‌లో ఇరాన్‌లో ట్రంప్ యుద్ధంపై మెర్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో ట్రంప్ ఇరాన్ చేతిలో అవమానానికి గురవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించాయి. ఆ దేశంతో కొనసాగిస్తున్న సత్సంబంధాలను దెబ్బతీశాయి. ద్రవ్యో ల్బణం, ఇంధన ధరల పెంపు వంటివి జర్మనీ ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని, ఈ విషయంలో మెర్జ్ చేయగలిగిందేమీ లేదంటున్నారు. చాన్స్‌లర్‌గా సరైన ప్రత్యామ్నాయ నేత ప్రస్తుతానికి లేకపోవడం, ఆయనను తొలగిస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతుందనే భయాల నడుమ మెర్జ్‌కు పదవీ గండం లేదని పరిశీలకులు అంటున్నారు.


