ఇరాన్‌తో అణు ఒప్పందం ఎటూ తేలకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. చర్చలకు ఇరాన్ దిగి రాకపోవడం, మధ్యవర్తి పాకిస్తాన్ సైతం చేతులెత్తేయడంతో ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరింత చిరాకు పుట్టించినట్లున్నాయి.
ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరును మెర్జ్ తప్పుబట్టగా.. అందుకు ట్రంప్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండడం సరైందేనని మెర్జ్ భావిస్తున్నారు. కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఒకవేళ ఇరానే గనుక అణ్వాయుధం కలిగి ఉంటే.. ప్రపంచమే దానికి బందీ అవుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. గత అమెరికా అధినేతలెవరూ చేయలేని పనిని తాను చేస్తున్నానని.. అందుకు సంతోషించాలని మెర్జ్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే వాస్తవానికి.. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను పొందకూడదు. ఆ దేశ అణు సామర్థ్యం యూరప్‌కే కాదు.. ప్రపంచానికి ప్రమాదకరం’’ అని మెర్జ్ అన్నారు. అదే సమయంలో చర్చల్లో ఇరాన్ నైపుణ్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా ఈ సమస్యను ఎదుర్కొనే విధానం అస్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్‌కి వెళ్లి చర్చలు జరిపినా, ఎటువంటి ఫలితం రాలేదని ఆయన ఉదహరించారు. అయితే..

మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ పొరపాటుగా అర్థం చేసుకున్నారా? లేదంటే అమెరికా తీరును తప్పుబట్టినందుకు మండిపోయి అలా పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా వ్యూహాలపై యూరప్ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అసలు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందా? అని ప్రశ్నించాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ నాయకత్వం అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టారని విమర్శించాయి. అప్పటి నుంచి అమెరికా-యూరప్ దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి.


