christian democratic union
-
సీడీయూ, సీఎస్‌యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్‌యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్‌ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్‌యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్‌డీ పార్టీకి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్‌యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్‌డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్‌కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్‌కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
వైఫల్యం నుంచి చాన్స్‌లర్ దాకా..
జర్మనీకి కాబోయే చాన్స్‌లర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ పేరు జర్మనీ అంతటా మార్మోగిపోతోంది. న్యాయవాదిగా అపార అనుభవం గడించి ఆర్థిక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన మెర్జ్ చివరకు మళ్లీ రాజకీయాల్లో చేరి ఎట్టకేలకు చాన్స్‌లర్ పదవికి తాను సరైన వ్యక్తిని అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో ఆసక్తితో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) వైపు అడుగులు వేసిన మెర్జ్ తదనంతరకాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు. కానీ సిద్ధాంతపరమైన విభేదాలు ఆయనను పార్టీ వీడేలా చేశాయి. ఒక దశాబ్దంపాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ రాజకీయ గాలిసోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పగ్గాలు సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేశారు. ఒకానొక సమయంలో విఫల రాజకీయ నాయకుడిగా మీడియా ముద్రవేసింది. అయినాసరే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అలుపెరుగని పోరాటం చేసి ఎట్టకేలకు పార్టీ పగ్గాలను రెండేళ్ల క్రితం సాధించారు. కేవలం ఈ రెండేళ్లలోనే పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెట్టి తన రాజకీయ చతురతను చాటారు. అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్న మెర్జ్ రాజకీయ ఆటుపోట్ల ప్రయాణాన్నిఓసారి తరచిచూద్దాం. మిలియనీర్ కార్పొరేట్ లాయర్బడా వ్యాపార సంస్థల తరఫున కేసులు వాదించే సీనియర్ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న మెర్జ్ ఆకాలంలో కోట్ల రూపాయలు సంపాదించి మిలియనీర్‌గా అవతరించారు. 70వ దశకంలో సైనికుడిగా ఆ తర్వాత చాన్నాళ్లు న్యాయవాదిగా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించి సైనిక, న్యాయ, శాసన వ్యవస్థల్లో అపార అనుభవం గడించారు. మెర్జ్ 1972 నుంచి సీడీయూ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. 1989లో పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు. 1994లో హోచ్ సౌర్లాండ్ క్రీస్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టారు. సీడీయూలో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2000 సంవత్సరంలో పార్టీ పార్లమెంటరీ నేతగా ఎదిగారు. 2005 ఏడాది నుంచి ఆయన రాజకీయ పతనం మొదలైంది. సీడీయూ, సీఎస్‌యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తనకు సరైన పార్టీలో, ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గ్రహించారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఏంజెలా మెర్కల్తో పోటీపడి అలసిపోయారు. దీంతో చివరకు 2009లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పునరాగమనం ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2018లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఆ ఏడాది సీడీయూ నేతగా ఏంజెలా మెర్కల్ దిగిపోయారు. దీంతో తనకు రాజకీయ అవకాశాలు బలపడతాయని గ్రహించి మెర్జ్ మళ్లీ పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ పదవికి పోటీచేసి 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. దీంతో మీడియా ఈయనపై విఫలనేత ముద్రవేసింది. 2021లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. పార్టీలో కీలకనేతగా ఎదిగి చిట్టచివరకు 2022లో పార్టీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ మూలాలు దెబ్బకొడతానని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యవహారాల్లో ఉత్తర అమెరికా దేశాలతో యూరప్ దేశాలు కలిసి మెలసి ఉండాలనే ‘అట్లాంటిక్ వాదం’ను మెర్జ్ మొదట్నుంచీ గట్టిగా వినిపంచేవారు. ఈ ఒక్క విషయంలో జర్మనీలో ఎక్కువ మంది మెర్జ్‌ను గతంలో బాగా విమర్శించేవారు. అయినాసరే అమెరికా, కెనడా వంటి దేశాలతో జర్మనీ సత్సంబంధాలు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని బలంగా వాదించారు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే వాగ్ధాటి, కార్పొరేట్ లాయర్‌గా దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం, లాబీయింగ్ నైపుణ్యం, వివిధ పెట్టుబడుల బ్యాంక్ బోర్డుల్లో సాధించిన అనుభవం.. మెర్జ్‌కు రాజకీయాల్లో బాగా అక్కరకొచ్చాయి. ఈ అర్హతలే మెర్జ్‌ను ఛాన్స్లర్ పీఠం వైపు నడిపించాయి. ‘జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’ వంటి నినాదాలు, ‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం, సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా. రష్యాను ఎదుర్కొనేలా ఉక్రెయిన్‌కు సాయపడతా’ వంటి వాగ్దానాలు ఈయనను నయా జర్మనీ నేతగా నిలబెట్టాయి. రెండు విమానాలకు యజమానిచాంధసవాదానికి, గ్రామ సమాజాలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ జర్మనీలోని బ్రిలాన్ పట్టణంలో 1955 నవంబర్ 11న మెర్జ్ జన్మించారు. కుటుంబానికి న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మెర్జ్ తండ్రి న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఆయన సీడీయూ పార్టీలోనూ కొనసాగారు. మెర్జ్ సైతం న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అంతకు ముందు 1975లో జర్మన్ సైన్యంలో సైనికుడిగా దేశసేవ చేశారు. 1985లో న్యాయవిద్యను పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు. 1986లో జడ్జి పదవికి రాజీనామా చేసి కార్పోరేట్ లాయర్ అవతారం ఎత్తారు. మూడేళ్లపాటు జర్మన్ రసాయనరంగ సంఘానికి ప్రైవేట్ లాయర్‌గా పనిచేశారు. 1981లో తోటి న్యాయవాది, ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న షార్లెట్ మెర్జ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. మెర్జ్ రాజకీయాల నుంచి విరామం తీసుకున్న దశాబ్దం పాటు అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అట్లాంటిక్ సంబంధాలను సమర్థించే లాబీ అయిన ‘అట్లాంటిక్–బీఆర్ 1/4కే’కు సారథ్యం వహించారు. పైలట్ శిక్షణా తీసుకున్నారు. ఈయనకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఈయనకు సొంతంగా రెండు విమానాలు కూడా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తదుపరి జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్ !
బెర్లిన్: క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) నేత ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి జర్మనీ చాన్స్‌లర్‌గా అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. జర్మనీ పార్లమెంట్(బండేస్టాగ్)కు ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ముందంజలో నిలిచింది. దీంతో తమ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుందని సీడీయూ/సీఎస్‌యూ కూటమి ముఖ్యనేతలు ప్రకటించారు. జర్మనీ ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ ఏఆర్డీ, జెడ్‌డీఎఫ్ పబ్లిక్ టెలివిజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 29 శాతం ఓట్లు పడ్డాయి. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 19.6 శాతం ఓట్లు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇన్నాళ్లూ ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలో అధికారంలో కొనసాగిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) కేవలం 16 శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. దీంతో ఒలాఫ్ షోల్జ్ తన ఓటమిని అధికారికంగా అంగీకరించారు. ‘‘ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలొచ్చాక ప్రభుత్వ ఏర్పాటుకు ఏమాత్రం ఆలస్యం చేయబోం’’ అని ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆదివారం బెర్లిన్‌లో ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. -
జర్మనీ విజేత ఎవరు?.. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్‌హైమ్, జోలింగన్, మాగ్డీబర్గ్, అషాఫన్బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్‌లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్ మెర్జ్..క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్ షోల్జ్..సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్‌లర్‌గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్‌ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్ వీడెల్..2013లో ఏఎఫ్‌డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్‌లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్‌కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్ హబెక్..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్‌లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్‌కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్ కనెక్ట్రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్‌ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్‌డబ్ల్యూ)’ సైతం చాన్స్‌లర్ పదవిపై కన్నేసింది. బీఎస్‌డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్‌డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్‌డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్‌డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్‌లర్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్‌యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది. గడచిన రెండు దశాబ్దాల ఫలితాల కన్నా అధిక సీట్లు కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. అయినప్పటికీ, అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సోమవారం వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్ట్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)లు 41.7 శాతం ఓట్లతో భారీ విజయం నమోదు చేసుకున్నాయి. యూరో జోన్లో ప్రస్తుతం నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనూ ప్రజలందరూ 59 ఏళ్ల మెర్కెల్ నాయకత్వానికే మద్దతు పలకడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.