హౌతీల దూకుడు.. ట్రంప్‌ ప్లాన్‌ ఢమాల్‌! | Houthis Offensive Forces Trump to Abandon Yemen Strike Plan | Sakshi
Sakshi News home page

హౌతీల దూకుడు.. ట్రంప్‌ ప్లాన్‌ ఢమాల్‌!

Sep 22 2026 6:51 AM | Updated on Sep 22 2026 6:56 AM

Houthis Offensive Forces Trump to Abandon Yemen Strike Plan

పశ్చిమాసియాలో ఇప్పటికే ఇరాన్‌–అమెరికా యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. యెమెన్‌లో హౌతీల దూకుడు ఆ ప్రాంతాన్ని మరో సంక్షోభంలోకి నెడుతోంది. ఇరాన్‌ మద్దతున్న హౌతీలు ఎర్ర సముద్రం తీరంలో వేగంగా ముందుకు సాగుతూ కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వారి చూపు వ్యూహాత్మక పర్వతాలపై పడింది. మరోవైపు హౌతీలను అడ్డుకునేందుకు అమెరికా సాయం కోరిన యెమెన్‌ ప్రభుత్వం.. ట్రంప్‌ నుంచి మాత్రం ప్రత్యక్ష హామీ పొందలేకపోయింది.

హౌతీలపై అమెరికా నేరుగా దాడి చేయబోతోందనే పరిస్థితి చివరి నిమిషంలో మారిపోయింది. పక్కా సమాచారం ప్రకారం.. ఆదివారం హౌతీలపై వైమానిక దాడులు చేయడానికి ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. హౌతీల స్థావరాలపై దాడులు చేసేందుకు విమానాల్లో బాంబులు ఎక్కిస్తున్న సమయంలోనే ట్రంప్‌ వాటిని నిలిపివేయాలని ఆదేశించారు. అంటే.. హౌతీలపై అమెరికా సైనిక చర్యకు సిద్ధమైనా.. ఆఖరి క్షణంలో ఆ ప్లాన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇటు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అటు వైట్‌హౌస్‌ రెండూ ఇప్పటికీ స్పందించలేదు.

ఇదే సమయంలో సౌదీ మద్దతు ఉన్న యెమెన్‌ ప్రభుత్వం అమెరికా సాయం కోరింది. ఆ దేశ అధ్యక్షుడు రషాద్‌ అల్‌ అలీమి, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ట్రంప్‌ ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇప్పుడు పర్వతాలే టార్గెట్‌
హౌతీల తాజా వ్యూహం యెమెన్‌లో పరిస్థితిని మరింత కీలకంగా మార్చేలా కనిపిస్తోంది. ఈ నెలలో ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో వేగంగా ముందుకు సాగిన హౌతీలు.. ఇప్పుడు తైజ్‌, లహిజ్‌ ప్రావిన్సుల మధ్య ఉన్న కహ్‌బూబ్‌ పర్వతాల వైపు కదులుతున్నారు. ఈ ఎత్తైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ఎర్ర సముద్ర తీరాన్ని దక్షిణ యెమెన్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాల నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది.

అల్‌-వజియాహ్‌ పర్వత ప్రాంతం, బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధి సమీపంలోని రాస్‌ అల్‌-అరా ప్రాంతాల్లో పోరు తీవ్రంగా సాగుతున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా బాబ్‌ ఎల్‌ మండెబ్‌ రీజియన్‌పై పట్టు కోల్పోయాక.. యెమెన్‌ రక్షణాత్మక ధోరణి ప్రదర్శిస్తోందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.

700 మంది మృతి.. 1.30 లక్షల మంది నిరాశ్రయులు
హౌతీల తాజా దాడులతో యెమెన్‌లో మానవతా పరిస్థితి కూడా విషమిస్తోంది. తాజా పోరులో దాదాపు 700 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. సుమారు 1,30,000 మంది యెమెన్‌లోనే నిరాశ్రయులయ్యారు. మరో 3,000 మందికి పైగా ఎర్ర సముద్రం దాటి పడవల్లో ఆఫ్రికా వైపు వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలను ఉటంకిస్తూ కథనం పేర్కొంది.

హౌతీలను అడ్డుకునేందుకు సౌదీ అరేబియా కూడా రంగంలోకి దిగింది. హౌతీల స్థావరాలపై వందలాది వైమానిక దాడులు చేసింది. అయినప్పటికీ పర్వత ప్రాంతాల్లో హౌతీలను వెనక్కి నెట్టడం సౌదీ బలగాలకు సవాలుగా మారింది.

సౌదీ చమురు ఎగుమతులకు కొత్త చిక్కు
యెమెన్‌లో జరుగుతున్న పోరుకు మరో కీలక కోణం ఉంది. అది చమురు రవాణా. బాబ్‌ ఎల్‌ మండెబ్‌ ప్రాంతంలో హౌతీల పట్టు బలపడితే.. హర్ముజ్‌ జలసంధి వద్ద ఏర్పడే అంతరాయాలను తప్పించుకునేందుకు సౌదీ ఉపయోగించే ప్రత్యామ్నాయ చమురు మార్గానికి ఇబ్బంది కలగొచ్చు. దీంతో సౌదీ ఇప్పటికే హర్ముజ్‌ మీదుగా మరిన్ని చమురు రవాణాలను పెంచింది.

ఆగస్టులో రోజుకు సుమారు 7 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ చమురు ఎగుమతులు హర్ముజ్‌ మీదుగా ఇటీవలి రోజుల్లో 29 లక్షల బ్యారెళ్లకు చేరినట్లు ఉపగ్రహ డేటా తెలియజేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్‌ మార్గంలో రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు పేర్కొంది.

అమెరికాకు పెరుగుతున్న ఒత్తిడి
హౌతీల దూకుడు ట్రంప్‌ ప్రభుత్వాన్ని చిక్కులో పడేస్తోంది. ఒకవైపు సౌదీ అరేబియా తమకు మద్దతుగా అమెరికా సైనిక జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు యెమెన్‌లో ప్రత్యక్షంగా మరో యుద్ధంలోకి దిగితే ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశం ఉంది.

గతంలో 2025 ప్రారంభంలో అమెరికా రెండు నెలల పాటు హౌతీలపై దాడులు చేసినప్పటికీ.. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్‌ వాటిని నిలిపివేశారు. అప్పటి నుంచి యెమెన్‌ ఘర్షణలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలపై దాడులకు సిద్ధమై.. విమానాల్లో బాంబులు ఎక్కించే దశకు వెళ్లిన అమెరికా.. ట్రంప్‌ ఆదేశాలతో చివరి నిమిషంలో ఆ చర్యను నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.

అదే సమయంలో హౌతీలు మాత్రం వ్యూహాత్మక ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తమ ఆధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకవైపు హౌతీల దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు వారిపై సైనిక చర్యకు సిద్ధమైన ట్రంప్‌ ప్రభుత్వం చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం యెమెన్‌ సంక్షోభంలో కీలక పరిణామంగా మారింది.

ఇటు హర్ముజ్‌లోనూ ఉద్రిక్తత
ఇటు హర్ముజ్‌ జలసంధిలోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. బ్రిటన్‌ సముద్ర భద్రత సంస్థ యూకేఎంటీవో (UKMTO) ప్రకారం.. జలసంధిలోకి వెళ్తున్న ఓ నౌకపై ప్రాజెక్టైల్‌ దాడి జరగడంతో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. మరో గ్యాస్‌ ట్యాంకర్‌పై కూడా దాడి జరిగినట్లు సమాచారం.

ఇరాన్‌–అమెరికా మధ్య దౌత్య ప్రయత్నాలు కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో యెమెన్‌లో హౌతీల దూకుడు.. మిడిల్‌ ఈస్ట్‌ వార్‌కు మరో కీలక ఫ్రంట్‌ను జోడించింది. హౌతీలపై దాడులకు సిద్ధమైన అమెరికా చివరి నిమిషంలో ఆ ప్రణాళికను ఎందుకు నిలిపివేసిందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందా? లేదంటే సౌదీ, యెమెన్‌ బలగాలకే మద్దతు పరిమితం చేస్తుందా? అన్నది చూడాలి.

ఇదీ చదవండి: అమెరికా వర్సెస్‌ చైనా.. ఇప్పుడు ఓ కొత్త వార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement