Photo Credit: Twitter
సౌతాఫ్రికాలో పర్యటించనున్న ఆస్ట్రేలియా మల్టీ ఫార్మాట్ సిరీస్ (మొదట మూడు వన్డేలు, తర్వాత మూడు టెస్టులు) ఆడనుంది. ఈ నేపథ్యంలో రేపు డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఇప్పటికే జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కమిన్స్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ కేవలం ఒక్క వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తన నిర్ణయాన్ని వెల్లడించగా, బోర్డు కూడా అతడి విజ్ఞప్తిని అంగీకరించింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కంటే ముందు టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా ఆస్ట్రేలియా టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియా ఆడనుండడంతో దీనిని కమిన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు. కమిన్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు.
వీళ్లిద్దరు మొదటి వన్డేతో పాటు మూడో వన్డే ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే కమిన్స్ మాత్రం కేవలం రెండో వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే మిచెల్‌మార్ష్ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశముంది.
ఇక సౌతాఫ్రికా టూర్‌లో ఆస్ట్రేలియా తొలుత గురువారం తొలి వన్డే, సెప్టెంబర్ 27న రెండో వన్డే, సెప్టెంబర్ 30న మూడో వన్డే ఆడనుంది. ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న ఆస్ట్రేలియా అక్టోబర్ 9 నుంచి 13 మధ్య తొలి టెస్టు, అక్టోబర్ 18 నుంచి 22 మధ్య రెండో టెస్టు, అక్టోబర్ 26 నుంచి 30 మధ్య మూడో టెస్టు ఆడనుంది.


