ఆస్ట్రేలియాను వణికించిన తెలుగు కుర్రాడు.. ఎవరంటే? | Chigurupati Venkatas key breakthroughs in India U19 vs Australia U19 2nd Youth ODI | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాను వణికించిన తెలుగు కుర్రాడు.. ఎవరంటే?

Sep 21 2026 6:00 PM | Updated on Sep 21 2026 6:04 PM

Chigurupati Venkatas key breakthroughs in India U19 vs Australia U19 2nd Youth ODI

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్‌-19తో జరిగిన రెండో అనధికారిక వన్డేలో భారత యువ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పర్యాటక జట్టుపై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో యశ్‌వర్ధన్‌ సింగ్‌ (122) భారీ సెంచరీతో చెలరేగగా.. ఆర్యవీర్ సెహ్వాగ్ (47), వినీత్‌ (87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్‌ బౌలర్లలో థామస్ వాసియో మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి 41.1 ఓవర్లలో 238 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ మూడు వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు యశ్‌వర్థన్ సింగ్ చౌహన్, కావ్య పటేల్ చెరో రెండు వికెట్లు సాధించారు.

మన తెలుగు కుర్రాడే!
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన చిగురుపాటి వెంకట ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించాడు. అతడి పూర్తి పేరు 'చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్'. ఏపీలో జన్మించినప్పటికీ, అతడు దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 18 ఏళ్ల సుభాష్‌కు బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది.

గత దేశవాళీ సీజన్‌లో నాలుగు ప్రధాన టోర్నమెంట్లలో కలిపి మొత్తం 380 పరుగులు చేయడంతో పాటు 49 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కూచ్ బెహార్ ట్రోఫీలో అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రతిష్టాత్మక అండర్‌-19 టోర్నీలో గోవా జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరడంలో సుభాష్ కీలక పాత్ర పోషించాడు. 

ఈ టోర్నీలో 26 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 224 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనల ఆధారంగానే గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడ లంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించి మెరిశాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement