శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు జపాన్‌తో చారిత్రాత్మక ఏకైక టీ20 మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జపాన్ చేరుకున్న టీమిండియా, మంగళవారం రోజున 'సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్' వేదికగా ఆతిథ్య జట్టుతో తలపడనుంది.
అయితే ఈ ముఖ్యమైన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు సానో మైదానంలో ప్రాక్టీస్ చేసే అవకాశం దక్కలేదు. షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌లో 'మెన్ ఇన్ బ్లూ' పాల్గొనాల్సి ఉంది. కానీ ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నట్లు 'రెవ్‌స్పోర్ట్జ్' జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ ఎక్స్ వేదికగా వేదికగా వెల్లడించారు.
ఇటీవలే జింబాబ్వే, అఫ్గానిస్తాన్‌లతో జరిగిన సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌కు, పసికూన జపాన్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాలేమీ కాదు. కాబట్టి ప్రాక్టీస్ లేకపోవడం జట్టు ప్రదర్శనపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. భారత్-జపాన్ దేశాల మధ్య 75 ఏళ్ల మైత్రీ, దౌత్య సంబంధాలకు గుర్తుగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ చారిత్రాత్మక T20 పోరుకు 'సుజుకి కప్' అని నామకరణం చేశారు.
జపాన్ టీ20, ఆసియా క్రీడలకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యష్ ఠాకూర్, విప్రజ్ నిగమ్.
చదవండి: జపాన్ చేరుకున్న టీమిండియా; ఆతిథ్యంపై శ్రేయస్ ఏమన్నాడంటే?


