PC: PCB/X
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై దిగ్గజ బౌలర్ వసీం అక్రం నిప్పులు చెరిగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌ల మార్గదర్శనంలోనూ జట్టు చెత్త ప్రదర్శనే కనబరుస్తోందని మండిపడ్డాడు. ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడినా.. స్వదేశానికి తిరిగిరాగానే ఓ ఆటగాడికి ఘనంగా స్వాగతం పలికారని.. ఇదే మన మైండ్‌సెట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
మట్టికరిచి.. 3-0తో వైట్‌వాష్
బాబర్ ఆజం కెప్టెన్సీలో పాక్ జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడు టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ 3-0తో వైట్‌వాష్ అయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్, 103 పరుగులు, రెండో టెస్టులో 194 పరుగులు, మూడో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 ఫైనల్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించింది పాక్. ఇదిలా ఉంటే.. మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేయడంతో పాటు.. హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది.
రాణించిన రజావుల్లా
ఈ క్రమంలో మూడో టెస్టుకు కొత్తగా ఏడుగురు ఆటగాళ్లను తీసుకోగా.. వారిలో రజావుల్లా కాస్త మెరుగ్గా ఆడాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చిన 21 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. పాక్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 63 బంతుల్లో 81 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో రజావుల్లాను వకార్ యూనిస్‌తో పోలుస్తూ పాక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక స్వదేశానికి తిరిగి రాగానే అతడికి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఘాటుగా స్పందించాడు. వకార్ యూనిస్‌తో కలిసి మాంచెస్టర్ ఈవెంట్లో మాట్లాడుతూ..
బాగానే ఆడావు.. కనీసం ముఖమైనా దాచుకో
‘‘ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లను తీసుకువచ్చినా పాక్ జట్టు ఆట తీరులో ఎలాంటి మార్పూ లేదు. ఇంగ్లండ్ చేతిలో కేవలం ఓడిపోలేదు... చిత్తుగా చిత్తుగా పరాజయం పాలై మట్టికరిచాము. ఇక రజావుల్లా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గొప్పగా ఆడాడు.
అతడు ఎంతో ప్రతిభావంతుడు. అయితే, అతడు ఇస్లామాబాద్ చేరుకోగానే దాదాపు ఐదు వేల మంది అతడికి స్వాగతం పలికేందుకు వచ్చారు. పూలమాలలు, బొకేలతో అతడిని సత్కరించారు.
ఇంటికి వెళ్లాక సంబరాలు చేసుకో
ఇంతటి ఘోర పరాభవం తర్వాత జట్టు తిరిగి వచ్చింది. కనీసం నీ ముఖమైనా దాచుకో అబ్బాయ్.. ఇంటికి వెళ్లాక అక్కడ సంబరాలు చేసుకో. మనోళ్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో ఈ దృశ్యాలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. జట్టు ప్రదర్శన ఎంత దిగజారినా మనకి మాత్రం సంబరాలు చేసుకోవడం అలవాటైపోయింది’’ అని వసీం అక్రం తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
కాగా పెషావర్‌లోని మార్దాన్‌లో జన్మించిన రజావుల్లా 2025 నవంబరులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి పెషావర్ తరఫున దేశీ క్రికెట్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మూడో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
చదవండి: ఆసీస్‌పై వీరేందర్ సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం
A GRAND WELCOME OF RAZAULLAH IN ISLAMABAD. 🇵🇰 pic.twitter.com/HU9Q2Ujx3H
— Sheri. (@CallMeSheri1_) September 15, 2026


