జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. చిక్కుల్లో భార‌త క్రికెట‌ర్‌! | India Player Vipraj Nigam-Lands-In-Trouble-Before-Japan-T20 Match | Sakshi
Sakshi News home page

జపాన్‌తో చారిత్రక మ్యాచ్‌.. చిక్కుల్లో భార‌త క్రికెట‌ర్‌!

Sep 21 2026 5:18 PM | Updated on Sep 21 2026 5:44 PM

India Player Vipraj Nigam-Lands-In-Trouble-Before-Japan-T20 Match

Photo Credit: IPL Twitter

టీమిండియా యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు విప్రజ్ టీమిండియాతో పాటు జపాన్ చేరుకున్నాడు. జపాన్‌తో టీమిండియా ఆడే చారిత్రక మ్యాచ్‌కు కూడా విప్రజ్‌ ఎంపికయ్యాడు. ఈ చారిత్రక మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్రజ్ నిగమ్‌పై వచ్చిన తాజా ఆరోపణలు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. 

విషయంలోకి వెళితే.. విప్రజ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న అతడి నివాసానికి సోమవారం ఒక యువతి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో విప్రజ్ తల్లి ఇంట్లోనే ఉన్నారు.  విప్రజ్‌ ఇంటి ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. 

అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇంటికి వచ్చి దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిరీక్షించడం చర్చనీయాం శంగా మారింది. కాగా గతంలో విప్రజ్ నిగమ్ ఒక యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అసలేం జరిగింది?
నవంబర్ 8, 2025న విప్రజ్ నిగమ్‌..  హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి తనను వేధిస్తోందని, ఫోన్ చేసి రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బారాబంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విప్రజ్ తనపై కేసు పెట్టిన కొద్ది రోజులకే ఆ యువతి కూడా తిరగబడింది. గౌతమ్‌బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో విప్రజ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రివర్స్ కేసు దాఖలు చేసింది.

ఆ యువతి తన ఫిర్యాదులో.. తాము ఇంటర్నెట్ ద్వారా 2025 మే నెలలో పరిచయం అయ్యామని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూలై 29న నోయిడాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. 

తాజాగా సదరు యువతి విప్రజ్ ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు జపాన్ వెళ్లిన విప్రజ్ నిగమ్‌ను తాజా వివాదం అతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ పరిణామం అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి:  దుమ్మురేపిన యశ్‌.. ఆస్ట్రేలియాపై భారత్‌ ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement