IND vs WI: భారత జట్లు, షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు | IND vs WI ODIs T20Is 2026 India Squads Schedule Live Streaming Details | Sakshi
Sakshi News home page

IND vs WI: భారత జట్లు, షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌, ఆరంభ సమయం.. వివరాలు

Sep 17 2026 11:25 AM | Updated on Sep 17 2026 11:58 AM

IND vs WI ODIs T20Is 2026 India Squads Schedule Live Streaming Details

Photo: Starsports

అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది. ఇరుజట్ల మధ్య సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇందుకు సంబంధించి తమ వన్డే, టీ20 జట్లను బుధవారం ప్రకటించింది.

హార్దిక్‌, పంత్‌లకు దక్కని చోటు
వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకుంటున్న పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. 

వారికి తొలి పిలుపు
అయితే, పంజాబ్‌ ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్, జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీ తొలిసారి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. దేశవాళీల్లో పంజాబ్‌ తరఫున నిలకడగా రాణిస్తున్న నమన్‌ ధీర్‌... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున మెరుపులు మెరిపించాడు. ఇక కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆఖిబ్‌ నబీకి వన్డే జట్టు నుంచి పిలుపు వచ్చింది.

దిగ్గజాలతో పాటు జడ్డూ కూడా
ఇక టెస్టు, టీ20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వన్డే జట్టులో చోటు నిలబెట్టుకోగా... స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో సెలక్టర్లు సీనియర్‌ ప్లేయర్లపై విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ నెల 20 వరకు పాండ్యా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనుండగా... భారత్‌ ‘ఎ’ తరఫున ఆడిన తర్వాతే అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసే అంశాన్ని పరిశీలించే అవకాశాలున్నాయి. 

నితీశ్‌ రెడ్డి రాక
ఇక పాండ్యా అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడలకు ఎంపికైన జట్టులో ఉన్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని వెస్టిండీస్‌తో వన్డే జట్టులో చేర్చారు. హైదరాబాదీ మొహమ్మద్‌ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్‌నూర్‌ బ్రార్‌ రూపంలో ముగ్గురు పేసర్లు ఉండగా... అదనంగా నబీని ఎంపిక చేశారు.

గతంలోనే నబీ శ్రీలంకతో సిరీస్‌కు భారత టెస్టు జట్టులోకి ఎంపికైనా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. 

బుమ్రా లేడు
ఇక వెస్టిండీస్‌తో తలపడే టీ20 జట్టు విషయానికి వస్తే ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టులో స్వల్ప మార్పులతో విండీస్‌తో సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. ఆసియా క్రీడల్లో ఆడనున్న జట్టులోని యశ్‌ ఠాకూర్, విప్రాజ్‌ నిగమ్‌ల స్థానాల్లో ప్రిన్స్‌ యాదవ్, మయాంక్‌ యాదవ్‌ను ఎంపిక చేశారు.

అయితే ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆ తర్వాత ఆసియా  క్రీడల్లో పాల్గొననున్నాడు. విండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌ల కోసం ప్రకటించిన జట్లలో మాత్రం అతడి పేరు లేదు. దీనిపై సెలెక్టర్లు కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.

విండీస్‌తో సిరీస్‌కు భారత వన్డే జట్టు: 
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్, ధ్రువ్‌ జురేల్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్‌నూర్‌ బ్రార్, మెహమ్మద్‌ సిరాజ్, ఆఖిబ్‌ నబీ, యశస్వి జైస్వాల్, నమన్‌ ధీర్‌.

విండీస్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు: 
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్, సంజూ సామ్సన్, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అర్‌‡్షదీప్‌ సింగ్, ప్రిన్స్‌ యాదవ్, మయాంక్‌ యాదవ్‌.  

భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయాలు 
వన్డే సిరీస్‌
👉సెప్టెంబరు 27- తొలి వన్డే-  త్రివేండ్రం- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 
👉సెప్టెంబరు 30- రెండో వన్డే- గువాహటి- మధ్యాహ్నం రెండు గంటల నుంచి 
👉అక్టోబర్‌ 3-  మూడో వన్డే-  న్యూచండీగఢ్‌- మధ్యాహ్నం రెండు గంటల నుంచి

టీ20 సిరీస్‌
👉అక్టోబర్‌ 6-     తొలి టీ20-  లక్నో-  రాత్రి  ఏడు గంటల నుంచి 
👉అక్టోబర్‌ 9-     రెండో టీ20-  రాంచీ-  రాత్రి  ఏడు గంటల నుంచి
👉అక్టోబర్‌ 11-     మూడో టీ20- ఇండోర్‌- రాత్రి  ఏడు గంటల నుంచి
👉అక్టోబర్‌ 14-    నాలుగో టీ20- హైదరాబాద్‌- రాత్రి  ఏడు గంటల నుంచి
👉అక్టోబర్‌ 17-     ఐదో టీ20- బెంగళూరు- రాత్రి  ఏడు గంటల నుంచి

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..
స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ (టీవీ), జియో హాట్‌స్టార్‌ (డిజిటల్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement