అగార్కర్‌ అవుట్‌.. టీమిండియాకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌! | Ajit Agarkar Unlikely To Continue As Chief Selector, Parthiv Patel And Pragyan Ojha In Race, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అగార్కర్‌ అవుట్‌.. టీమిండియాకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌!

Sep 17 2026 10:51 AM | Updated on Sep 17 2026 11:57 AM

Agarkar Out BCCI Lines Up 2 Man Shortlist For Chief Selector Role: Report

అజిత్‌ అగార్కర్‌ (Photo Credit: BCCI/Starsports)

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ఈ నెల (సెప్టెంబరు)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు సుముఖంగానే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌-2027 వరకు అగార్కర్‌నే సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగించాలని బోర్డు భావించినట్లు తెలిసింది.

అయితే, అగార్కర్‌ మాత్రం చీఫ్‌ సెలక్టర్‌గా కొనసాగేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తాజా సమాచారం. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు బుధవారం భారత వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా అగార్కర్‌కు ఇదే ఆఖరి సమావేశం అని సమాచారం.

రేసులో వారే
ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ కథనం ఆసక్తికర విషయం వెల్లడించింది. చీఫ్‌ సెలక్టర్‌గా అగార్కర్‌ స్థానాన్ని భారత మాజీ వికెట్‌ కీపర్‌​ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ లేదంటే.. మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొనట్లు తెలిపింది. 

కాగా పార్థివ్‌ పటేల్‌ (గుజరాత్‌), ప్రజ్ఞాన్‌ ఓజా ఇద్దరూ టీమిండియా తరఫున సత్తా చాటడంతో పాటు మూడుసార్లు టైటిళ్లు గెలిచిన ఐపీఎల్‌ జట్లలో సభ్యులు కావడం విశేషం.  ఇక ఒడిశాకు చెందిన ఓజా ఇప్పటికే సెలక్షన్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు.

ఘనమైన విజయాలు
కాగా 2023 జూలైలో అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. అతడి హయాంలో భారత జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరింది. ఇక 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచింది. అదే విధంగా 2025లో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచింది. అంతేకాదు గతేడాది ఆసియా కప్‌ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూన్‌లోనే అగార్కర్‌ పదవీకాలం ముగిసినప్పటికీ బీసీసీఐ అతడిపై నమ్మకంతో అక్టోబరు 4 దాకా గడువు పొడిగించింది. అయితే, దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలను వన్డే ప్రపంచకప్‌-2027 దాకా కొనసాగించే విషయంలో అగార్కర్‌- బీసీసీఐ పెద్దల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

అందుకే విభేదాలు!
రో-కో ప్రపంచకప్‌ ఆడే విషయంపై స్పష్టత ఇవ్వలేదంటూ అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రో- కో మాత్రం తాము కచ్చితంగా వన్డే వరల్డ్‌కప్‌ ఆడతామనే సంకేతాలు ఇచ్చారు. ఇక రోహిత్‌- కోహ్లి అర్దంతరంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణం కూడా అగార్కర్‌ వైఖరేనని గతంలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తలెత్తిన విభేదాల కారణంగా బీసీసీఐ పెద్దలు, అగార్కర్‌ మధ్య దూరం పెరిగిందని.. అందుకే అగార్కర్‌ ఇక తన పదవి నుంచి దిగిపోకతప్పలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

చదవండి: ఆసియా క్రీడలకు నితీశ్‌ కుమార్‌ రెడ్డి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement