సౌదీకి కొత్త టెన్షన్‌.. హౌతీల సంచలన ప్రకటన! | Houthis Claim To Have Shot Down Saudi F-15 Fighter Jet Over Yemen, Release Wreckage Video | Sakshi
Sakshi News home page

సౌదీకి కొత్త టెన్షన్‌.. హౌతీల సంచలన ప్రకటన!

Sep 17 2026 8:01 AM | Updated on Sep 17 2026 9:54 AM

Houthis Claim to Shoot Down Saudi F-15 Fighter Jet Over Yemen Marib

సౌదీ అరేబియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా సౌదీకి చెందిన ఎఫ్‌-15నే కూల్చేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ఇప్పుడు పశ్చిమాసియాలో కలకలం రేపుతోంది. యెమెన్‌ గగనతలంలో సౌదీకి చెందిన అత్యాధునిక యుద్ధవిమానాన్ని స్థానికంగా తయారుచేసిన క్షిపణితో నేలకూల్చినట్లు ప్రకటించింది. విమానం కూలుతున్న దృశ్యాలంటూ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న హౌతీలు.. ఇప్పుడు యుద్ధవిమానాన్నే కూల్చినట్లు చెప్పడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. అయితే ఈ ప్రకటనను సౌదీ ధృవీకరించలేదు.

గత వారం రోజుల్లో యెమెన్‌ వ్యాప్తంగా సౌదీ అరేబియా 450కిపైగా వైమానిక దాడులు జరిపిందని హౌతీలు ఆరోపించారు. ఖమీస్‌ ముషైత్‌, తాయిఫ్‌ వైమానిక స్థావరాల నుంచి ఎఫ్‌-15, టైఫూన్‌ యుద్ధవిమానాలతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. తైజ్‌, లహిజ్‌, అల్‌-జౌఫ్‌, హజ్జా, మారిబ్‌, సాదా, అల్‌-బైదా ప్రావిన్సుల్లో దాడులు జరిగాయని, పౌరులు మరణించడంతోపాటు పలువురు గాయపడ్డారని హౌతీలు వెల్లడించారు. ఈ దాడులకు ప్రతిగా మారిబ్‌ గగనతలంలోకి వచ్చిన సౌదీ యుద్ధ విమానాలపై తమ దళాలు క్షిపణులతో దాడి చేశాయని పేర్కొన్నారు. కూలిన విమానం శకలాల కోసం గాలిస్తున్న సౌదీ యుద్ధ విమానాలను కూడా లక్ష్యంగా చేసుకుని వెనక్కి వెళ్లేలా చేశామని హౌతీ వర్గాలు ప్రకటించాయి.

మరో సౌదీ డ్రోన్‌ కూడా కూల్చివేత?
ఎఫ్‌-15 యుద్ధ విమానాన్ని కూల్చినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే.. మరో కీలక ప్రకటన చేసింది హౌతీ సైన్యం. మారిబ్‌ ప్రాంతంలో సౌదీకి చెందిన వింగ్‌ లూంగ్‌-2 సాయుధ నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్లు వెల్లడించింది. తమపై దాడులకు పాల్పడుతున్న సమయంలోనే దానిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.

మరోవైపు.. సౌదీ, హౌతీల మధ్య ఘర్షణలు మక్కా సమీపానికి చేరడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మక్కాకు దక్షిణంగా ఓ హౌతీ డ్రోన్‌ను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ ప్రకటించింది. అది నగర నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపింది. పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం ‘రెడ్‌లైన్‌’ దాటడమేనని రియాద్‌ హెచ్చరించింది. అయితే మక్కాపై తాము దాడి చేయలేదని హౌతీలు తెలిపారు. ఈ ఘటనను సౌదీ ప్రచారం కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

2015 నుంచి కొనసాగుతున్న పోరు
సౌదీ అరేబియా 2015 నుంచి యెమెన్‌లో హౌతీలకు వ్యతిరేకంగా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో కాల్పుల విరమణతో ఘర్షణలు కొంత తగ్గినప్పటికీ.. ఈ నెలలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగినట్లు కథనాలు చెబుతున్నాయి. ఎర్ర సముద్ర తీర ప్రాంతాలు, బాబ్‌ అల్‌-మండేబ్‌ జలసంధి పరిసరాల్లోనూ హౌతీలు తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎఫ్‌-15ను కూల్చినట్లు చేసిన ప్రకటన తమ వైమానిక రక్షణ సామర్థ్యం పెరిగిందనడానికి నిదర్శనమని హౌతీ నేతలు పేర్కొంటున్నారు. 

ఇదీ చదవండి: భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాక్‌ నౌక​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement