హౌతీల దాడులతో అప్రమత్తమైన సౌదీ ప్రభుత్వం
ఈజిప్టు పర్యటనకు వెళ్లిన యువరాజు సల్మాన్
రియాద్: ముస్లింల పవిత్ర నగరం మక్కాలో మంగళవారం అసాధారణ రీతిలో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు దాడులను ముమ్మరం చేయడం, ఎర్ర సముద్ర తీరంపై పట్టు సాధిస్తున్న నేపథ్యంలో మక్కాతోపాటు జెడ్డా, తయాఫ్ నగరాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ పశ్చిమ తీరంపైకి యెమెన్‌లో తయీజ్ నుంచి హౌతీ మిలిటెంట్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికారులు జారీ చేసిన సూచనలను అనుసరించాలని హెచ్చరికల్లో పేర్కొంది. గుంపులుగా తిరగొద్దని, అక్కడి పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు తీయవద్దని కోరింది.
దాదాపు మూడు గంటల అనంతరం ప్రమాదం తొలగిపోయినట్లు దేశ సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా ఇలాంటి అత్యవసర హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఎర్ర సముద్ర తీరానికి మక్కా నగరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమవారం హౌతీలు సౌదీ అరేబియాపైకి వరుసగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో 13 మంది గాయపడ్డారు. మంగళవారం సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఎర్ర సముద్ర యాన్‌బు సహా కనీసం ఆరు నగరాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఇలా ఉండగా, సౌదీ అరేబియా వైమానిక దాడుల కారణంగా యెమెన్‌లోని తయీజ్‌లో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు.
కైరోలో యువరాజు సల్మాన్
పరిస్థితులు విషమిస్తున్న సమయంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం సన్నిహిత మిత్ర దేశం ఈజిప్టులో పర్యటనకు వెళ్లారు. కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసితో ఉభయ దేశాలకు ప్రయోజనకరమైన అంశాలపై ఆయన చర్చలు జరిపారని మీడియా తెలిపింది. వారం వ్యవధిలోనే హౌతీలు బాబ్ ఎల్ మాండేబ్ జలసంధిపై పట్టుసాధించారు. సోమవారం ఎర్ర సముద్రంలోని హనీష్ దీవిని కూడా స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి సమీపంలోని కోల్పోయిన భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు సౌదీ ప్రభుత్వ యెమెన్ బలగాలు ప్రయత్నించిన నేపథ్యంలో హౌతీలు ఊహించని రీతిలో వారిని తరిమికొట్టారు.
ప్రమాదంలో ప్రాంతీయ భద్రత: భారత్
సౌదీ అరేబియాపై హౌతీల దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని పౌర మౌలిక వనరులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు ప్రాంతీయ భద్రతకు ప్రమాదంగా మారాయని, బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి గుండా స్వేచ్ఛా నౌకాయానానికి ముప్పుగా మారాయని తెలిపింది. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ పైవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు.


