ఏఐతో ముప్పు వట్టిదే! | Donald Trump dismisses concerns about dangers of AI | Sakshi
Sakshi News home page

ఏఐతో ముప్పు వట్టిదే!

Sep 16 2026 3:28 AM | Updated on Sep 16 2026 3:28 AM

Donald Trump dismisses concerns about dangers of AI

అదంతా మోసపూరిత ప్రచారం 

ఏఐకి పగ్గాలేయాలనడం ఓ కుట్ర

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాదన

వాషింగ్టన్‌: ఊరందరిది ఒకదారైతే... ఉలిపికట్టెది ఇంకోదారి అని సామెత. కృత్రిమ మేధ విషయంలో ఇప్పుడు ట్రంప్‌ వ్యవహారమూ ఉలిపికట్టె చందంగానే కనిపిస్తోంది. ఏటికేడాదీ శక్తిమంతమవుతున్న ఏఐ దుర్వీనియోగం కాకుండా.. మనిషి నియంత్రణలోంచి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు ఓపెన్‌ ఏఐ, ఆంత్రోపిక్‌ వ్యవస్థాపకులు సామ్‌ ఆల్ట్‌మ్యాన్, డారియో అమోడైలతోపాటు స్పేస్‌ ఎక్స్‌ఏఐ ఫౌండర్‌ ఎలాన్‌ మస్క్‌లు బహిరంగంగా పిలుపునిచి్చన తరువాత కూడా ట్రంప్‌... ఏఐతో ముప్పు వట్టిదేనని ప్రకటించడం ఈ సామెతను మరోసారి గుర్తు చేస్తుంది. 

కృత్రిమమేధ దారితప్పే అవకాశముందన్న ఆందోళనలపై ట్రంప్‌ సోమవారం వ్యాఖ్యానిస్తూ.. ‘‘కొత్త టెక్నాలజీలను పరిమితం చేసే ఏ ప్రయత్నమైనా కుట్రే’’అని అన్నారు. ‘‘ఏఐ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తుంది.. మానవత్వాన్ని నాశనం చేస్తుందన్నది అంతా మోసపూరిత ప్రచారం మాత్రమే’’అని కొట్టిపారేశారు. సోషల్‌ మీడియాలో వరుస పోస్టుల ద్వారా ఏఐపై ఆందోళనలు అనవసరం అన్న వాదన వినిపించారు. ఆసక్తికరంగా... చైనా ఏఐపై అంతర్జాతీయ సమాజపు పర్యవేక్షణకు మద్దతు పలికింది.  కొన్నేళ్లలోనే ఏఐ విపరీతమైన ప్రాచుర్యం సంపాదించుకోవడం మనందరికీ తెలుసు. అప్పటివరకూ అసాధ్యమనుకున్న చాలా విషయాలను ఏఐ సుసాధ్యం చేసింది. అదేసమయంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ ముసురుకున్న వివాదాలూ అన్ని ఇన్ని కావు. 

ఏఐ వాడకం కోసం అవసరమై న డేటా సెంటర్లతో కాలుష్యం పెరిగిపోతుందని, విద్యుత్తు, నీరు భారీగా ఖర్చవుతాయన్న ఆందోళనలు వ్యక్తం కావడం ఒకపక్కనుంటే.. ఏఐ స్వయంగా మనిషి నియంత్రణ మీరి ప్రవర్తిస్తుందని, ఇది మరిన్ని సైబర్‌ మోసాలకు దారితీయడమే కాకుండా... జీవాయుధాల తయారీ వంటి ప్రమాదకర ధోరణులకూ దారి తీయవచ్చునని ఆంత్రోపిక్‌ వ్యవస్థాపకుడు డారియో అమిడో స్వయంగా ప్రకటించారు. గత శనివారం ఆయన ఇటీవలే నివేదిక విడుదల చేస్తూ.. ఏఐని దుర్వీనియోగం చేస్తూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని పిలుపునిచ్చారు. 

ఇంకో ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు ఏఐ టెక్నా లజీ ఇంటర్నెట్‌ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్‌ఏఐ వ్యవస్థాపకుడు సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌ కూడా అమొడై వాదనలతో దాదాపుగా ఏకీభవిస్తూ ఒక సోషల్‌ మీడియా పోస్టు పెట్టారు. మరోవైపు మైక్రోసాఫ్ట్‌  తాజాగా ఏఐ మనిషి నియంత్రణలోనే ఎలా ఉంచుకోవాలన్న విషయంపై నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది.  

చైనా పుంజుకుంటుంది 
ఏఐ కంపెనీల మాటలు ఎలా ఉన్నా ట్రంప్‌ మాత్రం ఏఐ విషయంలో అమెరికా తగ్గితే చైనా లాభపడుతుందని వ్యాఖ్యానిస్తూండటం గమనార్హం. ‘‘డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీలకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై సంతోషంగా ఉన్నది ఒక్క చైనా మాత్రమే’’అని ట్రంప్‌ ఈ మధ్యే చెప్పారు.

 ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం అజమాయిïÙని ట్రంప్‌ చాలాకాలంగా నిరోధిస్తూ వస్తున్న విషయం చెప్పుకోవాల్సిన అంశం. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించి బైడెన్‌ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను రద్దు చేసిన ట్రంప్‌ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తే పూర్తిస్థాయి మద్దతిస్తూ తనదైన ఆదేశాలు జారీ చేశారు కూడా. ఇదిలా ఉంటే ఏఐ విషయంలో నెమ్మదించా లన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో టెక్నాలజీ కంపెనీల షేర్ల ధరలు తగ్గిపోవడం గమనార్హం. 

ఇదిలా ఉంటే... చైనా మాత్రం ఏఐకి ముకుతాడు వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని మంగళవారం పిలుపునిచ్చింది. మానవాళి మేలు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏఐ మనిషి నియంత్రణ దాటకుండా చూసుకోవాలని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ తెలిపారు. ఏఐ అన్నది మానవాళి సమష్టి జ్ఞానం. ప్రజలందరి సొత్తు. అంత్జాతీయ సహకారంతో దీని అభివృద్ధి, పర్యవేక్షణ జరగాలి అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటనలోనూ ఏఐ నియంత్రణకు సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చునని అంచనా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement