నాసిక్: వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ స్వీట్ షాప్ ప్రత్యేకమైన మోదక్‌ను తయారు చేసి, అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విద్యా వికాస్ సర్కిల్‌లోని సాగర్ స్వీట్స్ 24 క్యారెట్ల తినదగిన బంగారు పూతతో ‘గోల్డెన్ మోదక్’ను తయారు చేసింది. కిలో ధరను ఏకంగా రూ.27,000గా నిర్ణయించింది. దీంతో ఈ మోదక్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వినాయక చవితిని పురస్కరించుకుని సాగర్ స్వీట్స్ 25కు పైగా రకాల మోదక్‌లను అందుబాటులోకి తెచ్చింది. సంప్రదాయ రకాలతో పాటు ప్రీమియం స్వీట్లు ఇందులో ఉన్నాయి. అయితే 24 క్యారెట్ల బంగారు పూతతో రూపొందించిన మోదక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వినాయక చవితి వేడుకల్లో మోదక్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది గణేశుడికి ఇష్టమైన పదార్థంగా భావిస్తారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు కొబ్బరి కోరు తదితర పదార్థాలతో నింపిన మోదక్‌లు, చాక్లెట్ మోదక్‌లు తదితర రకాలను తయారు చేసి గణేశుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సంప్రదాయ మోదక్‌లు వేడుకల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా స్వీట్ షాపులు కొత్త రకాల మోదక్‌లను పరిచయం చేస్తున్నాయి.
వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 14న ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ భక్తులు ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇళ్లలో, మండపాల్లో మట్టి గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజూ ప్రార్థనలు, నైవేద్యాలు, హారతులు నిర్వహిస్తారు. చివరగా గణేశ నిమజ్జనంతో వేడుకలు ముగుస్తాయి.
ఇదీ చదవండి: గణేశ్ మండపంలో దారుణ హత్య


