సాక్షి,వైఎస్సార్ జిల్లా: పులివెందులలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేష్ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. టీడీపీ నేతలు పుష్పనాథ్‌రెడ్డి, విజయ్‌రెడ్డిల మధ్య స్థానిక వివాదం కారణంగా వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో విజయ్‌రెడ్డి, పుష్పనాథ్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఇరువర్గాలూ పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘర్షణలో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద నిలిపి ఉంచిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. అయితే ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారడంతో, ఆయన గన్‌మెన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


