మూలపేట పరిసర ప్రాంతాల్లో భూదోపిడీ
డీ పట్టా, ఎల్‌సీ భూములే అక్రమార్కుల టార్గెట్
నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకు కొనుగోళ్లు
శ్రీకాకుంళం సంతబొమ్మాళి: మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణం నేపథ్యంలో సంతబొమ్మాళి మండలంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో పోర్టు పరిసర ప్రాంతాల్లోని డీ పట్టా, అసైన్డ్ ల్యాండ్ సీలింగ్ భూములపై కొందరు అక్రమార్కుల కన్నుపడింది. డీ పట్టా, అసైన్డ్, ఎల్‌సీ(ల్యాండ్ సీలింగ్) భూముల రైతులను మభ్యపెట్టి భయపట్టి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సాగు చేసుకుని అనుభవించేందుకు ఇచ్చిన డీ పట్టా, ఎల్‌సీ భూములను క్రయవిక్రయాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ రైతులను మోసగించి కొందరు వ్యక్తులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో చీకటి ఒప్పందాలు చేసుకుని భూములను తమ ఆ«దీనంలోకి తెచ్చుకున్నారు.
ఇదీ పరిస్థితి..
మూలపేట పోర్టు నిర్మాణంతో నౌపడ, యమాలపేట, పోతునాయుడుపేట, హనుమంతు నాయుడు పేట, వడ్డితాండ్ర, కోటపాడు, కాశీపురం తదితర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామాన్ని ఆసరాగా చేసుకుని కొందరు చోటా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు డీపట్టా, ఎల్‌సీ భూములపై దృష్టి సారించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములు కాబట్టి పరిశ్రమలు వస్తే భూములు ఉచితంగా వెనక్కి తీసుకుంటారంటూ రైతులను మభ్యపెట్టి భయపట్టించారు. దీంతో భయపడిన రైతులు సెంటు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు మార్కెట్‌లో ధర ఉన్నప్పటికీ చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. వడ్డితాండ్ర పరిధిలోని సర్వే నంబర్లు 180–3,170–3,182–2లో దాదాపు 8 ఎకరాల డిపట్టా భూములు చేతులు మారాయి. అగ్రిమెంట్లు కూడా జరిగిపోయి తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. దీనిపై స్థానిక అధికార పార్టీ నాయకుడు హస్తం ఉన్నట్లు రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు సంబంధించి రికార్డులు, యాజమాన్య హక్కులు క్రయవిక్రయాల వివరాలపై సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.
ఎల్‌సీ భూములపైనా కన్ను..
యామలపేట–ఇజ్జువరం మధ్య పోతునాయుడుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ –346లో సుమారు 110 ఎకరాల ల్యాండ్ సీలింగ్ (ఎల్‌సీ) భూములపైనా అక్రమార్కులు కన్నుపడింది. ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులను భయపెట్టి వారి నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. పోతునాయుడుపేట రెవెన్యూ పరిధిలో రైతులకు తెలియకుండా ల్యాండ్ సీలింగ్ భూములను కొందరు రెవెన్యూ సిబ్బంది, రియల్ ఎస్టేట్ వ్యాపారి కలిసి భూముల కొలతలు తీసుకునేందుకు ప్రయతి్నంచారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని తమకు తెలియకుండా భూములను ఎందుకు కొలుస్తున్నారంటూ నిలదీసి రైతులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి ల్యాండ్ సీలింగ్ భూములు.. ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందంటూ రైతులను భయపెట్టి సెంటు రూ.40 వేలు నుంచి లక్ష రూపాయల వరకు విలువ చేసే భూమిని రూ.12 వేలకే కొనుగోలు చేశారు. ఇందుకు సహకరించిన అప్పటి రెవెన్యూ సిబ్బందికి ముగ్గురు సర్వేయర్లకు సెంటుకు రూ.వె య్యి చొప్పున సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కమీషన్ రూపంలో చెల్లించినట్లు రైతులు అంటున్నారు. అగ్రిమెంట్లు జరిగి కొన్ని ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాయి. దీనిపై విచారణ చేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు చెల్లవు..
డీ పట్టా, ఎల్‌సీ భూములు కొనుగోలు చేసినా చెల్లవు. ప్రభుత్వం అందించిన అటువంటి çభూముల పట్టాదారుడు లేకపోతే అది ప్రభుత్వ భూమిగా పరిగణిస్తాం. పరిశ్రమలు ఏర్పాట్లు చేస్తే అటువంటి భూములను ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీఐసీసీకి అప్పగిస్తాం. – హేమసుందరరావు, తహసీల్దార్, సంతబొమ్మాళి


