సియోల్: దక్షిణ కొరియా నేషనల్ సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు సంబంధించిన దుస్తుల నిబంధనలను సడలించింది. ఇకపై ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు జీన్స్, స్నీకర్స్ వంటి సాధారణ దుస్తులతో హాజరుకావచ్చు. అదే సమయంలో టైలు, ఫార్మల్ డ్రెస్ షూస్‌ను నిషేధించింది. 2026 అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగార్థులపై ఆర్థిక, మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంటర్వ్యూ వాతావరణాన్ని మరింత సహజంగా మార్చడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని సిబ్బంది నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ సివిల్ సర్వీస్ నియామక వ్యవస్థలో సంబంధిత శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పురుషులు, మహిళలు సంప్రదాయ ఫార్మల్ సూట్లు ధరించకుండా సాధారణ దుస్తులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. జీన్స్, కాటన్ ప్యాంట్లు, స్లాక్స్, నిట్‌వేర్, జాకెట్లు, షర్ట్లు, స్నీకర్స్ వంటి దుస్తులను ధరించవచ్చని పేర్కొంది. అయితే క్రీడా దుస్తులు, హైకింగ్ దుస్తులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్, హైహీల్స్, స్లిప్పర్స్ ధరించడాన్ని ప్రోత్సహించలేదు.
ముఖ్యంగా టైలు, ఫార్మల్ డ్రెస్ షూస్‌పై స్పష్టమైన నిషేధం విధించింది. టై ధరించి ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు మూల్యాంకన గదిలోకి వెళ్లే ముందు దాన్ని తొలగించాలని అధికారులు సూచిస్తారు. ఫార్మల్ డ్రెస్ షూస్ ధరించిన అభ్యర్థులు వాటిపై స్లిప్‌ఆన్ షూ కవర్లు ధరించాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెస్ షూస్‌పై నిషేధానికి కారణం కూడా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. గట్టి అడుగుభాగం ఉన్న షూస్ నేలపై పడే శబ్దం పరీక్షల సమయంలో పదేపదే అంతరాయాలకు, అభ్యర్థుల ఏకాగ్రతకు ఆటంకాలకు కారణమవుతోందని తెలిపింది.
దక్షిణ కొరియా ప్రభుత్వం 2016 నుంచే అభ్యర్థులు టైలు వదిలి సాధారణ దుస్తులు ధరించాలని అనధికారికంగా సూచిస్తూ వస్తోంది. అయితే ప్రతికూలంగా అంచనా వేస్తారనే భయంతో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులు ఇప్పటికీ ముదురు రంగు ఫార్మల్ సూట్లు, డ్రెస్ షూస్ ధరిస్తున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు సంబంధిత శాఖ ఆమోదయోగ్యమైన క్యాజువల్ దుస్తుల శైలులను చూపించే కృత్రిమ మేధ (ఏఐ) రూపొందించిన నమూనా చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ కొత్త దుస్తుల నిబంధనలు ఇంటర్వ్యూలు నిర్వహించే అధికారులకు కూడా వర్తిస్తాయి. తద్వారా అభ్యర్థులు, ఇంటర్వ్యూయర్ల మధ్య సంభాషణ మరింత సహజంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియా, ఉద్యోగార్థుల ఫోరమ్‌లలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ఫార్మల్ సూట్ల కొనుగోలు ఖర్చు తగ్గడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే అందరికీ ఒకే విధమైన ప్రాథమిక సూట్ ప్రమాణం లేకపోవడంతో తగిన క్యాజువల్ దుస్తులను ఎంచుకోవడంపై కొత్త ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు!


