న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్‌కు వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం ఆదివారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దీనిలో రాహుల్ సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి అల్పాహారం స్వీకరిస్తూ, పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. అన్వర్ ఇబ్రహిం రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఇరువురు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అనంతరం అల్పాహార టేబుల్ వద్దకు వెళ్లారు. అక్కడ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉండటంతో ముగ్గురూ కలిసి అల్పాహారం చేస్తూ మాట్లాడుకున్నారు. అయితే చర్చించిన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
Prime Minister of Malaysia Anwar Ibrahim met Lok Sabha Leader of the Opposition Rahul Gandhi and Congress MP Priyanka Gandhi Vadra for a breakfast meeting. (Source: AICC) https://t.co/tW5MCZfTKv
— ANI (@ANI) September 13, 2026
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రక్షణ, వాణిజ్యం, డిజిటల్ సాంకేతికత, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. ఫిబ్రవరి 2026లో మోదీ మలేసియా పర్యటన సందర్భంగా వచ్చిన ఫలితాలపైనా చర్చ జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, ఫిన్‌టెక్, విద్య, పర్యాటకం తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతిని నేతలు సమీక్షించారు.


