సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక వేతన ప్యాకేజీ భారీగా పెరగనుంది. జీతం, బోనస్‌లతో కలిపి ప్రస్తుతం ఉన్న 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల వార్షిక ప్యాకేజీ 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. సవరించిన వేతన విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ప్రభుత్వాధినేతగా వాంగ్ స్థానమూ మరింత బలపడనుంది.
ప్రజా సేవల వేతనాలపై స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరించినట్లు వాంగ్ తెలిపారు. అయితే రాజకీయ నాయకుల జీతాలను పెంచడం సింగపూర్‌లో సున్నితమైన అంశంగా కొనసాగుతోంది. అధిక వేతనాలపై దేశంలో చాలాకాలంగా చర్చ, విమర్శలు ఉన్నాయి.
తనకు పెరగనున్న వేతనంలో అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు. తాను ప్రధాన మంత్రిగా కొనసాగినంతకాలం, రానున్న ఐదేళ్లలో వేతన పెంపు ద్వారా లభించే అదనపు మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు అందజేస్తానని చెప్పారు.
పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడిన వాంగ్.. రాజకీయంగా క్లిష్టమైన అంశం అయినప్పటికీ దీనిని విస్మరించలేమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నాణ్యమైన రాజకీయ నాయకత్వాన్ని కొనసాగించడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు.
మంత్రులు, ఉప ప్రధానికీ భారీ పెంపు
కొత్త వేతన విధానంతో సింగపూర్ ఉప ప్రధాని, మంత్రుల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఉప ప్రధాని వార్షిక వేతన ప్యాకేజీ 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి దాదాపు 3 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. క్యాబినెట్ మంత్రులకు వారి సీనియారిటీ, బాధ్యతలను బట్టి 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు వార్షిక ప్యాకేజీ లభించనుంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారికి కూడా వేతనం సుమారు 1.1 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 1.2 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెరగవచ్చు.
రాజకీయ నాయకుల వేతనాలను నిర్ణయించేందుకు సింగపూర్ ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా సంపాదించే 1,000 మంది వ్యక్తుల ఆదాయ స్థాయిలను ఒక బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తుంది. ప్రైవేట్ రంగం, సివిల్ సర్వీసుల్లో వేతనాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని వాంగ్ తెలిపారు.
ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యం
రాజకీయ నాయకులకు అధిక వేతనాలు చెల్లించడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడం, అవినీతి ప్రమాదాన్ని తగ్గించడం అని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అధిక వేతనాల వల్ల ప్రజలు–రాజకీయ నాయకుల మధ్య ఆదాయ వ్యత్యాసం పెరుగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.
సింగపూర్ 2012లో మంత్రివర్గ వేతనాలను భారీగా సవరించింది. అప్పట్లో ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను 36 శాతం వరకు తగ్గించారు. 2017లో మరోసారి సమీక్ష చేపట్టినప్పటికీ అప్పట్లో వేతనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
ఇతర దేశాల నేతలతో పోలిస్తే..
వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీ ప్రపంచంలోని పలువురు దేశాధినేతలతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడి వార్షిక అధికారిక వేతనం 4 లక్షల డాలర్లు కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వేతనం కూడా సింగపూర్ ప్రధాని ప్యాకేజీతో పోలిస్తే చాలా తక్కువ. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు 7.19 లక్షల డాలర్లుగా ఉంది.
భారత ప్రధాని మోదీ వేతనం ఎంతంటే?
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీతో పోలిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లభించే వేతనం చాలా తక్కువ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత ప్రధానికి నెలకు సుమారు రూ.1.66 లక్షల వేతనం, అలవెన్సులు లభిస్తాయి. ఇందులో ప్రాథమిక వేతనం, నియోజకవర్గ భత్యం, రోజువారీ భత్యం, సమ్‌ప్చువరీ అలవెన్స్ వంటి అంశాలు ఉంటాయి. ఈ లెక్కన నగదు వేతనం, అలవెన్సులు కలిపి ఏడాదికి సుమారు రూ.19.2 లక్షలు అవుతాయి. అయితే ప్రధాని అధికారిక నివాసం, భద్రత, అధికారిక ప్రయాణం, సిబ్బంది వంటి ప్రభుత్వ సౌకర్యాలు వేరుగా ఉంటాయి.
ఇదీ చదవండి: భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే!


