అడ్డంకులు అధిగమించి ముందడుగు  | India is staunch supporter of freedom of navigation, safety of seafarers | Sakshi
Sakshi News home page

అడ్డంకులు అధిగమించి ముందడుగు 

Sep 12 2026 6:26 AM | Updated on Sep 12 2026 6:26 AM

India is staunch supporter of freedom of navigation, safety of seafarers

10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలి  

ఏటా 100 బ్రిక్స్‌ స్టార్టప్‌లను ఇతర సభ్య దేశాలకు విస్తరించాలి 

1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలి 

‘బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌’లో ప్రధాని మోదీ పిలుపు  

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే నౌకాయాన స్వేచ్ఛ, సురక్షిత సముద్ర మార్గాలు, నావికుల భద్రత అత్యవసరమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. పెరుగుతున్న ఆర్థిక బలాన్ని భారీ పెట్టుబడులుగా, నూతన వ్యాపార సంబంధాలుగా మార్చుకోవాలని బ్రిక్స్‌ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ‘బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌’లో ఆయన ప్రసంగించారు. 

10 ప్రధాన వాణిజ్య అవరోధాలను గుర్తించి తొలగించాలని చెప్పారు. ప్రతి సంవత్సరం 100 బ్రిక్స్‌ స్టార్టప్‌లను ఇతర సభ్య దేశాల మార్కెట్లలోకి విస్తరించాలని, అలాగే ఏటా 1,000 కొత్త వ్యాపార భాగస్వామ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. ఈ మూడు అంశాలపై మన పురోగతిని ప్రతి ఏటా సమీక్షించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన అడ్డంకులు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి అడ్డంకులను అధిగమిస్తూ మన ఆర్థిక శక్తిని నూతన వ్యాపార అవకాశాలుగా మార్చుకోవాలని స్పష్టంచేశారు. 

నౌకాయాన స్వేచ్ఛకు, నావికుల భద్రతకు భారత్‌ మద్దతిస్తోందని తెలిపారు. బ్రిక్స్‌ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 40 శాతం మరియు ప్రపంచ వాణిజ్యంలో నాలుగో వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ జీడీపీ సుమారు రెండున్నర రెట్లు వృద్ధి చెందగా, బ్రిక్స్‌ దేశాల ఉమ్మడి జీడీపీ మాత్రం నాలుగున్నర రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తంచేశారు.  

ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌  
ప్రపంచ వ్యాపారాలకు భారతదేశం చేసే ప్రతిపాదనలో మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సాంకేతికతలను ప్రధానాంశంగా మోదీ పేర్కొన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాల వేగవంతమైన విస్తరణతోపాటు నౌకా నిర్మాణం, సెమీకండక్టర్లు, క్వాంటమ్‌ టెక్నాలజీ, కీలక ఖనిజాలు, బయోటెక్నాలజీ రంగాల్లో నూతన సామర్థ్యాలను ప్రస్తావించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, ఇన్నోవేట్‌ విత్‌ ఇండియా, స్కేల్‌ ఫర్‌ వరల్డ్‌’అన్నారు. ప్రపంచ మార్కెట్లకు భారత్‌ ఒక తయారీ కేంద్రంగా, సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య మరింత లోతైన సహకారం కోసం భారతదేశ డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. 

బ్రిక్స్‌ దేశాలు తమ సొంత మార్కెట్లకు అనువైన డిజిటల్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి భారతదేశ అనుభవాన్ని వాడుకోవచ్చని అన్నారు. ఇండియాలో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇలాంటి ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లడంలో బ్రిక్స్‌ సహాయపడాలని కోరారు. వాణిజ్య అనుసంధానం అనేది మరో ప్రధాన అంశమని చెప్పారు. 2014 నుంచి భారత్‌ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, వ్యాపార అవకాశాలను విస్తరించడంపై బ్రిక్స్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement