ఉద్యోగులకు షాక్.. టెక్ దిగ్గజంలో మరోమారు లేఆఫ్స్! | Oracle Announces More Job Cuts Amid AI Driven Cash Crunch | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు షాక్.. టెక్ దిగ్గజంలో మరోమారు లేఆఫ్స్!

Sep 12 2026 4:40 PM | Updated on Sep 12 2026 5:22 PM

Oracle Announces More Job Cuts Amid AI Driven Cash Crunch

అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెద్ద ఎత్తున డేటా సెంటర్లను నిర్మించేందుకు కంపెనీ చేస్తున్న ఖర్చులు, నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతలను మరింత పెంచాలని సంస్థ నిర్ణయించింది.

కంపెనీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులతో కూడిన 2026 రీస్ట్రక్చరింగ్ ప్లాన్ కోసం మొత్తం ఖర్చు సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి చెల్లించాల్సిన పరిహారం, సెవరెన్స్ ఖర్చులు ఉన్నాయి.

ఇప్పటికే ఈ ప్రణాళికకు సంబంధించి సుమారు 2.1 బిలియన్ డాలర్ల ఖర్చును ఒరాకిల్ నమోదు చేసింది. తాజాగా మరో 700 మిలియన్ డాలర్ల మేర అదనపు ఖర్చు ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే.. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఒరాకిల్ భారీ స్థాయిలో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ వంటి సంస్థలకు అవసరమైన ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించేందుకు ఈ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అయితే.. ఇలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి భారీ మొత్తంలో నగదు అవసరం కావడంతో కంపెనీ ఖర్చులను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే.. మే చివరి నాటికి ఒరాకిల్‌లో అమెరికాలో సుమారు 49,000 మంది, అంతర్జాతీయంగా సుమారు 92,000 మంది పనిచేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 తగ్గింది. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement