డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సాంకేతిక సంస్థలు తమ వ్యాపార లాభాలను గడిస్తున్న ప్రాంతాల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు.
టెక్ సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా తాము ఏయే దేశాల్లో లేదా ప్రాంతాల్లో లాభాలు ఆర్జిస్తున్నాయో అక్కడ తగిన స్థానిక పన్నులను సమగ్రంగా చెల్లించాలని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఆ సమాజ అభివృద్ధికి తిరిగి సహకరించాలని స్పష్టం చేశారు. ‘ఒక చోట పన్ను చెల్లించి లాభాలు పొందే ఇతర ప్రాంతాల్లో బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
టెక్ కంపెనీలకు ఊతమిచ్చేలా..
భారతీయ టెక్, ఫిన్‌టెక్ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో వివిధ దేశాల డేటా భద్రత, లైసెన్సింగ్, పన్నులు, వినియోగదారుల రక్షణ విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు భారతీయ టెక్ రంగానికి అంతర్జాతీయంగా ఊతమిచ్చేలా ఒక ఫెడరేటెడ్ ఇండస్ట్రీ వేదిక ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ వేదిక విదేశీ నిబంధనలు కఠినతరం కాకముందే ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరపడానికి, సైబర్ సెక్యూరిటీ విధానాలను పంచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు.
ఏఐ భద్రతపై ఆందోళన
మరోవైపు ఏఐ వల్ల కలిగే భద్రతాపరమైన ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో ఏఐ తెస్తున్న మార్పులపట్ల కంపెనీల బోర్డులు, సీనియర్ యాజమాన్యాలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఏఐ నిర్ణయాలకు మానవ, సంస్థాగత బాధ్యతే ప్రాథమికమని ఆమె స్పష్టం చేశారు. ఆర్బీఐ రిటైల్, హోల్‌సేల్ డిజిటల్ రూపాయి (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ


