ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ (LVMH) వ్యవస్థాపకుడు, చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల టాప్-10 జాబితా నుంచి వైదొలిగారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆర్నాల్ట్ సంపద ప్రస్తుతం సుమారు 143 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆయన కంటే ముందు స్థానంలో బెర్క్‌షైర్ హాత్‌వే చైర్మన్ వారెన్ బఫెట్ నిలిచారు.
మరోవైపు టెక్ రంగానికి చెందిన అమెరికన్ బిలియనీర్లు సంపద ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 918.8 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత లారీ పేజ్, జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మైఖేల్ డెల్ తదితరులు ఉన్నారు. వెల్త్ ఇండెక్స్ 2012లో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా టాప్-10లోని అన్ని స్థానాలను అమెరికన్లే ఆక్రమించడం ఇదే మొదటిసారి.
ఈ ఏడాది భారీగా తగ్గిన ఆర్నాల్ట్ సంపద
ఆర్నాల్ట్ సంపదలో ఈ ఏడాది గణనీయమైన క్షీణత నమోదైంది. జనవరి నుంచి ఆయన నికర సంపద సుమారు 65 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ ట్రాక్ చేస్తున్న ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల్లో ఇదే అతిపెద్ద సంపద పతనంగా నిలిచింది.
ఆర్నాల్ట్ సంపద తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఎల్‌వీఎంహెచ్ వ్యాపారంపై లగ్జరీ మార్కెట్‌లో ఏర్పడిన మందగమనం ఒకటి. డియోర్, లూయిస్ విట్టన్, టిఫనీ వంటి ఫ్యాషన్, జ్యువెలరీ బ్రాండ్లతో పాటు డోమ్ పెరిగ్నాన్, హెన్నెస్సీ వంటి ప్రీమియం మద్యం బ్రాండ్లను ఎల్‌వీఎంహెచ్ నిర్వహిస్తోంది.
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు దుబాయ్ వంటి కీలక షాపింగ్ హబ్‌లలో అధిక విలువైన వస్తువుల డిమాండ్‌పై ప్రభావం చూపాయి. అదే సమయంలో చైనాలోనూ లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడం సంస్థకు సవాలుగా మారింది.
2017 నుంచి టాప్-10లో..
ఆర్నాల్ట్ 2017 మార్చి 22 నుంచి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల టాప్-10లో కొనసాగుతున్నారు. 2022 డిసెంబర్‌లో కొంతకాలం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. టాప్ స్థానానికి చేరుకున్న ఉత్తర అమెరికా వెలుపల వ్యక్తిగా, అలాగే వినియోగ వస్తువుల రంగానికి చెందిన ఏకైక బిలియనీర్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
కరోనా తర్వాత చైనాలో పెరిగిన పెంట్-అప్ డిమాండ్ లగ్జరీ పరిశ్రమకు భారీగా కలిసొచ్చింది. అయితే ఆ తర్వాత చైనాలో వినియోగం మందగించడం, అమెరికా సుంకాలపై అనిశ్చితి, కొన్ని మార్కెట్లలో ప్రీమియం మద్యం వినియోగం తగ్గడం వంటి అంశాలు ఎల్‌వీఎంహెచ్ వ్యాపారంపై ప్రభావం చూపాయి.
వారసత్వంపైనా ఆసక్తి
ఇక ఎల్‌వీఎంహెచ్‌లో ఆర్నాల్ట్ వారసత్వంపైనా చర్చ మొదలైంది. రెండు వివాహాలు చేసుకున్న ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరంతా కుటుంబ లగ్జరీ వ్యాపారంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన వాటాదారుల సమావేశంలో ఐదుగురు పిల్లలూ తొలిసారిగా మాట్లాడారు. అయితే ఆర్నాల్ట్ తర్వాత ఎల్‌వీఎంహెచ్ సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
శుక్రవారం పారిస్ ట్రేడింగ్‌లో ఎల్‌వీఎంహెచ్ షేరు స్వల్పంగా లాభపడినప్పటికీ, కంపెనీ మార్కెట్ విలువపై ఒత్తిడి కొనసాగుతోంది. ఇదే సమయంలో అమెరికా ఎస్‌అండ్‌పీ 500 సూచీ ఈ ఏడాది సుమారు 11 శాతం పెరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిమాండ్‌తో టెక్ కంపెనీల షేర్లు దూసుకెళ్లడం అమెరికన్ బిలియనీర్ల సంపద పెరుగుదలకు దోహదం చేసింది.
ఇదీ చదవండి: భారత్ మార్కెట్లోకి అమెరికా రియల్ ఎస్టేట్ కంపెనీ


