తల్లి కోపం.. బఫెట్ విజయ రహస్యం! | How Warren Buffett Strict Mother Shaped the World Greatest Investor | Sakshi
Sakshi News home page

తల్లి కోపం.. బఫెట్ విజయ రహస్యం!

May 10 2026 8:33 PM | Updated on May 10 2026 9:49 PM

How Warren Buffett Strict Mother Shaped the World Greatest Investor

ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఈయన ఇంత గొప్ప ఇన్వెస్టర్ ఎలా అయ్యారు?, దాని వెనుక ఆయన తల్లి పాత్ర ఎంత వరకు ఉంది? అనే ఆసక్తికరమైన విషయాలు 'మదర్స్ డే' సందర్భంగా ఈ కథనంలో చూసేద్దాం.

ప్రపంచంలో విజయవంతమైన, ధనవంతులైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్ వ్యక్తిగత జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్న తనం నుంచి కఠినమైన క్రమశిక్షణలో పెరిగారు. తల్లి లీలా స్టాల్ బఫెట్ కనుసన్నల్లో ఎదిగిన వారెన్ బఫెట్ చిన్ననాటి నుంచే ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగించేవారు. ఎందుకంటే తల్లి వృధా ఖర్చులను ప్రోత్సహించేది కాదు.

లీలా స్టాల్ బఫెట్ చాలా క్రమశిక్షణ గల, కఠిన స్వభావం కలిగి ఉండటం వల్ల.. ఆమె కోపానికి వారెన్ బఫెట్ భయపడేవారు. ఇంట్లో వాతావరణం చాలా క్రమశిక్షణతో ఉండేది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడి ఏర్పడేదని 'ద స్నోబాల్' (The Snowball) పుస్తకంలో వెల్లడించారు.

ఒకసారి భోజన సమయంలో చిన్న విషయంపై.. తల్లి కోపగించుకున్నప్పుడు ఇంట్లో నిశ్శబ్దం నెలకొందని బఫెట్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చాలా అసౌకర్యంగా ఫీలై డైనింగ్ టేబుల్ వదిలి తన గదికి వెళ్లిపోయినట్లు చెప్పుకున్నారు. అలాంటి అనుభవాలు ఆయన బాల్యంపై గాఢమైన ప్రభావం చూపాయి.

బఫెట్ చిన్న వయసులోనే చూయింగ్ గమ్ అమ్మడం, కోకా కోలా బాటిళ్లు విక్రయించడం, న్యూస్ పేపర్ వేయడం వంటి పనులు చేసి డబ్బు సంపాదించేవారు. ఆ డబ్బును వృధాగా ఖర్చు చేయకుండా.. పొదుపు చేసి తిరిగి పెట్టుబడి పెట్టేవాడు. వారెన్ బఫెట్ విజయానికి కేవలం తెలివి మాత్రమే కారణం కాదు. ఆయన సహనం, నియంత్రణ, ఆలోచన కూడా కారణాలే.

ఇదీ చదవండి: ఉద్యోగ జీవితం.. చివరికి అప్పులు: కియోసాకి వివరణ

బిలియనీర్ అయినప్పటికీ బఫెట్ జీవనశైలిలో పెద్ద మార్పు లేదు. ఆయన ఇప్పటికీ చాలా సాదాసీదాగా జీవిస్తారు. దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇంట్లోనే ఆయన నివాసం ఉంటున్నారు. విలాసవంతమైన జీవితం కన్నా సాదాసీదా జీవితాన్నే ఆయన ఎక్కువగా ఇష్టపడతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దీన్నిబట్టి చూస్తే.. చిన్నతనంలో తల్లి వల్ల ఏర్పడిన క్రమశిక్షణే నేటికీ ఆయనపై ప్రభావం చూపుతోందని స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement