న్యూఢిల్లీ: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దీనిలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘బ్రిక్స్’లో గ్లోబల్ సౌత్ దేశాల స్వరం గట్టిగా వినిపిస్తోందని అన్నారు. భారత అధ్యక్షతన నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. సత్సీలత, నవకల్పన, సహకారం, సుస్థిరత అనే నాలుగు స్తంభాలపై కృషి చేశామని చెప్పారు. సభ్య దేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి ఆలోచనలను అందరికీ ప్రయోజనం చేకూర్చే సహకారంగా మార్చగలిగామని పేర్కొన్నారు.
సరఫరా గొలుసులను మరింత విశ్వసనీయంగా, బలోపేతంగా మార్చేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ సహకార ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని మోదీ తెలిపారు. బ్రిక్స్ ఇన్‌క్యుబేటర్ నెట్‌వర్క్ ద్వారా స్టార్టప్‌లు, ఇన్‌క్యుబేటర్లను అనుసంధానించనున్నట్లు చెప్పారు. విస్తృతంగా అమలు చేయగల కొత్త పరిష్కారాలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi receives President of Kazakhstan, Kassym-Jomart Tokayev, at Bharat Mandapam on Day 2 of the BRICS Summit 2026. (Source: DD News) https://t.co/NRkO6pDWBM
— ANI (@ANI) September 13, 2026
డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని మోదీ అన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించనున్నట్లు తెలిపారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా ఉపయోగించడం ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చని హెచ్చరించారు. సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో అందరినీ భాగస్వాములను చేసే విధానానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
తొలి రోజు సమావేశాల్లో సభ్య దేశాల నేతలు ‘న్యూఢిల్లీ ప్రకటన-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రపంచ పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్‌కు మరింత పెద్ద పాత్ర కల్పించాలన్న ఆకాంక్షలకు మద్దతు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడంతోపాటు ఏకపక్ష ఆంక్షలు, సుంకాలు, వాణిజ్య పరిమితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
రెండో రోజు సమావేశాల్లో భారత్ 2026 అధ్యక్షతన నిర్దేశించిన స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పాలనలో సంస్కరణలకు సంబంధించి పది ప్రతిపాదనలు చేశారు. ప్రపంచ దక్షిణాది దేశాలు కేవలం నిబంధనలు అనుసరించే స్థాయి నుంచి వాటి రూపకల్పనలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ సాంకేతికతలు, వాటికి సంబంధించిన నియమాల రూపకల్పనలో సమాన భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. సముద్ర రవాణా సిబ్బంది అత్యవసర సహాయానికి ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi, Russian President Vladimir Putin and other world leaders at Bharat Mandapam PM Modi has hosted gala dinner for global leaders and delegates here (Source: DD) https://t.co/lOlKp0W7Df
— ANI (@ANI) September 12, 2026
బ్రిక్స్ ప్రకటనలో పశ్చిమాసియా సంక్షోభంపై ఆందోళన వ్యక్తమైంది. పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రపంచ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలు, ఇంధన ప్రవాహం సజావుగా కొనసాగేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పేర్కొంది. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారమే మార్గమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. భారత్-చైనా సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృష్టితో చూస్తున్నట్లు జిన్‌పింగ్ పేర్కొన్నారు. మరోవైపు, బ్రిక్స్ దేశాలు కృత్రిమ మేధ, క్వాంటమ్ సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతులు, స్టార్టప్‌లు, సరఫరా వ్యవస్థల వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించి, మూల దేశాలకు పురాతన వస్తువులు, ఆధ్యాత్మిక, చారిత్రక వస్తువులను తిరిగి అప్పగించేందుకు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.


