నలసోపారా: మహారాష్ట్రలోని నలసోపారాలో శనివారం సాయంత్రం వర్షం కారణంగా గణేశ్ విగ్రహం అదుపుతప్పి మీదపడటంతో నలుగురు మండప సభ్యులు దాని కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. పశ్చిమ నలసోపారాలోని యశ్వంత్ గౌరవ్ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపానికి భారీ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది. దీంతో విగ్రహం తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పేందుకు వెంట వచ్చిన కొందరు ప్రయత్నించారు. ఈ క్రమంలో విగ్రహం పడిపోయింది.
విగ్రహం కూలిన సమయంలో గణేశ్ మండపానికి చెందిన నలుగురు వ్యక్తులు దాని కింద చిక్కుకుపోయారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. అందులో కొందరు విగ్రహం కింద చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనను గమనించిన అక్కడున్న వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికులు కూడా వారితో కలిసి విగ్రహాన్ని పైకి లేపి, కింద చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు. వేగంగా స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం విగ్రహాన్ని పైకి లేపి గణేశ్ మండపం వద్దకు సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో విగ్రహానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. దీంతో మండప సభ్యులు, అక్కడున్న ఇతరులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: ‘పద్మ’లో పడవ బోల్తా.. 10 మందిని రక్షించిన బీఎస్ఎఫ్


