ఫ్రీ పెట్రోల్‌ కోసం ఆశగా వెళ్తే.. | Free Petrol Langer Turns Chaotic as Crowds Get No Fuel | Sakshi
Sakshi News home page

ఫ్రీ పెట్రోల్‌ కోసం ఆశగా వెళ్తే..

Aug 19 2026 8:35 AM | Updated on Aug 19 2026 8:40 AM

Free Petrol Langer Turns Chaotic as Crowds Get No Fuel

కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జనాలను ఆకట్టుకునే పేరుతో చేసే ప్రచారాలు ఎంతవరకు నిజమో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం పేరిట డబ్బులు వసూలు చేసే స్కాములు, సాయం పేరుతో పెయిడ్‌ వీడియోలు ఇలా ఎన్నో ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్‌ మీడియాలో ‘ఫ్రీ పెట్రోల్‌’ అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనదారులు పెట్రోల్‌ బంకుల వద్దకు పరుగులు తీశారు. తీరా అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది.

రాకేశ్‌ ట్రెహాన్‌ అనే వ్యక్తి సోషల్‌ సర్వీస్‌ పేరిట నెట్టింట కాస్త ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తే. అయితే.. ఉచితంగా పెట్రోల్‌ పంపిణీ చేస్తానంటూ ప్రకటించడంతో.. మంగళవారం సాయంత్రం ఛండీగడ్‌(పంజాబ్‌) వాహనదారులు బంకుల వద్దకు టూవీలర్లు, కార్లు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. అయితే అప్పటికే భారీ వర్షం మొదలైంది. ఉచితంగా వచ్చే పెట్రోల్‌ కోసం జనాలు దానిని పెద్దగా లెక్క చేయలేదు. ఈ లోపు క్యూ లైన్‌ భారీగా పెరిగిపోయింది.

అయితే చెప్పిన టైంకి పెట్రోల్‌ పంపిణీ ప్రారంభం కాలేదు. ఈలోపు బంక్‌ల వద్ద పరిస్థితులు చేజారిపోతుండడంతో నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి వాహనదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈలోపు బంక్‌వాళ్లు కేవలం 15 మందికి ఉచితంగా పెట్రోల్‌ కొట్టి.. మిగతావాళ్లకు నో చెప్పారు. ఫ్రీ టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో మిగతా వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉచిత పెట్రోల్‌ ఇస్తారన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని ఇలా వెనక్కి పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాకేశ్‌ను బండ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి వచ్చిన సుమన్‌ అనే మహిళ.. పెట్రోల్‌ ఇవ్వడానికి పంపు సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. కేవలం 10–15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినట్లు చెప్పారు. అన్షు అనే మరో వ్యక్తి తాను దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షంలో పెట్రోల్‌ పంపు వద్ద వేచి చూసినట్లు తెలిపారు.

రాకేశ్‌ రియాక్షన్‌
పరిస్థితిపై రాకేశ్‌ ట్రెహాన్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో ‘రాజా ది కింగ్‌’గా గుర్తింపు పొందిన ఆయన.. భారీ వర్షం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడటం, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పెట్రోల్‌ పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.

ఆగస్టు 21 నుంచి మళ్లీ.. మూడు రోజుల పాటు!
తాజా ప్రకటన ప్రకారం ‘పెట్రోల్‌ లంగర్‌’ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు రాకేశ్‌ ట్రెహాన్‌ తెలిపారు. అదే సమయం, అదే ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెట్రోల్‌ పంపిణీ కోసం ఆగస్టు 21న కూపన్లు లేదంటే కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత పెట్రోల్‌ పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement