రాజ్యసభ ఎన్నికలు.. కేంద్ర మంత్రులకు బీజేపీ బిగ్‌ షాక్‌! | Hardeep Puri, 7 other sitting MPs dropped from BJP list for upcoming RS polls | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికలు.. కేంద్ర మంత్రులకు బీజేపీ బిగ్‌ షాక్‌!

Oct 5 2026 4:49 PM | Updated on Oct 5 2026 4:58 PM

Hardeep Puri, 7 other sitting MPs dropped from BJP list for upcoming RS polls

లక్నో: సిట్టింగ్‌ రాజ్యసభ సభ్యులకు బీజేపీ బిగ్‌ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. అక్టోబర్ 16న జరగనున్న ఈ ఎన్నికల కోసం ప్రకటించిన జాబితాలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బన్వారీలాల్ వర్మ (బీఎల్‌ వర్మ)లతో పాటు పలువురు సిట్టింగ్ సభ్యులను పక్కన పెట్టింది. మొత్తంగా ఏడుగురు సిట్టింగ్ రాజ్యసభ సభ్యులను పక్కన పెట్టి కొత్త వారికి హైకమాండ్ అవకాశం కల్పించింది.  

ఈ జాబితా ప్రకారం.. ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపి కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్‌లకు బీజేపీ స్థానం కల్పించింది. ఇప్పటివరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న హర్దీప్‌‌ సింగ్ పూరి, బన్వారీలాల్‌ వర్మతో పాటు అరుణ్‌ సింగ్‌, సీమా ద్వివేదీ, నీరజ్‌‌ శేఖర్‌, బ్రిజ్‌లాల్‌, గీతా షాక్యాలకు మొండి చేయి చూపించింది. 

రానున్న 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ అభ్యర్థుల ఎంపికలో కుల ప్రాతినిధ్యం, సంస్థాగత అనుభవానికి సమ ప్రాధాన్యం ఇచ్చింది. ముగ్గురు ఓబీసీలు, ఇద్దరు ఎస్సీలు, ముగ్గురు అప్పర్ క్యాస్ట్ అభ్యర్థులతో పాటు ఇద్దరు మహిళలకు స్థానం కల్పించింది.  

మహిళా అభ్యర్థులలో బారాబంకీ మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ ఒకరు కాగా, మరొకరు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శృతి గంగ్వార్ ఉన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత నాయకుడు విద్యాసాగర్ సోంకర్ గతంలో లోక్‌సభ ఎంపీగా, ఎమ్మెల్సీగా, అలాగే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అలాగే సంస్థాగత అనుభవం ఉన్న ప్రకాష్ పాల్ (కాన్పూర్-బుందేల్‌ఖండ్ ప్రాంతీయ మాజీ లీడర్), రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్‌ (పశ్చిమ యూపీ బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)లకు కూడా అధిష్టానం అవకాశం కల్పించింది.

ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్న స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, మిగతా స్థానాలపై సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) కూడా గట్టి పట్టు సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement